మిడ్ మానేరు భూ నిర్వాసితుల మహా పాదయాత్ర

మిడ్ మానేరు భూ నిర్వాసితుల మహా పాదయాత్ర

మిడ్ మానేరు భూ నిర్వాసితులు ఆందోళనలు ఉధృతం చేశారు. మహా పాదయాత్ర పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వరకు జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. బోయిన్ పల్లి మండలం నీలోజ్ పల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్, బీజేపీ నేత ప్రతాప రామకృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మొత్తం 15 కిలోమీటర్ల మేర జరిగే ఈ పాదయాత్రలో 11 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు.

ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. 18ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ఇంటి స్థలంతో పాటు 2లక్షల పరిహారం, నిర్వాసితులకు 5లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేపట్టారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు, ఆయన సోదరిని రైతు కూలీలుగా గుర్తించి పరిహారం, ఇంటి స్థలం అందించిన ప్రభుత్వం.. మిగితా నిర్వాసితులను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన చాలా మందికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.