కడసారి చూపైనా దక్కుతుందో.. లేదో..? మావోయిస్ట్ అగ్రనేతలు కోస, వికల్ప్ కుటుంబ సభ్యుల ఆవేదన

కడసారి చూపైనా దక్కుతుందో.. లేదో..? మావోయిస్ట్ అగ్రనేతలు కోస, వికల్ప్ కుటుంబ సభ్యుల ఆవేదన

కరీంనగర్/సిద్ధిపేట/కోహెడ, వెలుగు: ఛత్తీస్‎గఢ్ రాష్ట్రం అబుజ్‎మడ్ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్ కౌంటర్‎లో అసువులుబాసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్‎ను కడసారి చూసుకుని, మృతదేహాలను తీసుకొచ్చేందుకు వారి రక్త సంబంధీకులు ఛత్తీస్ గఢ్​రాష్ట్రానికి మంగళవారం తరలివెళ్లారు.

తమ తోబుట్టువుల కడసారి చూపుకైనా నోచుకుంటామో..? లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది. తమవారి శవాలనైనా ఇస్తే తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించుంటామని వారు చత్తీస్ గఢ్​ పోలీసులను కోరుతున్నారు. సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి మృతితో వారి స్వగ్రామాలైన సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉద్యోగాన్ని వీడి.. 

తీగలకుంటపల్లికి చెందిన కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్(64) బడి పంతులుగా పేదలకు విద్యా బోధన చేస్తూ నమ్మిన సిద్దాంతం కోసం 40 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లారు. కోహెడలో పాఠశాల చదువు, సిద్ధిపేటలో ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్న ఆయన వరంగల్‎లో టీటీసీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులు ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. 1984లో గవర్నమెంట్  స్కూల్  టీచర్‏గా ఉద్యోగం రావడంతో పెంచికలపేట, వరికోలులో స్పెషల్  టీచర్‏గా పని చేశారు. 

1988లో శాంతిప్రియను ప్రేమ వివాహం చేసుకున్న రాంచంద్రారెడ్డి టీచర్ జాబ్‎కు లాంగ్ లీవ్ పెట్టి ఎల్ఎల్ఎం చేయడం కోసమని, 1989లో భార్యతో కలిసి ఔరంగబాద్ వెళ్లాడు. అక్కడి నుంచి దంపతులిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లి కొంతకాలం నాగ్ పూర్  డెన్ కీపర్‎గా పని చేశారు. రామచంద్రారెడ్డి కొన్నేళ్లు ఛత్తీస్ గఢ్‎లో లాయర్‎గా ప్రాక్టీస్ కూడా చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. 

అంతకుముందు దండకారణ్య జోనల్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడని, ఆ తర్వాత కొంత కాలానికి ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్‎లో మృతిచెందాడని ప్రచారం జరిగినా చివరకు అది వాస్తవం కాదని తేలింది. సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పని చేసిన రామచంద్రారెడ్డి భార్య శాంతిప్రియను 2008 జనవరి 22న పోలీసులు అరెస్ట్  చేశారు. ఆమె వివిధ కేసుల్లో శిక్ష అనుభవించి మూడేళ్ల క్రితమే విడుదలయ్యారు. 

ప్రస్తుతం తన పిల్లలతో కలిసి హైదరాబాద్‎లో ఉంటున్నారు. రామచంద్రారెడ్డి తల్లిదండ్రులు కట్టా వజ్రవ్వ, మల్లారెడ్డి(97) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తల్లి వజ్రమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉండగా, రాంచంద్రారెడ్డి చనిపోయాడనే వార్త తెలియడంతో ఆమె  పరిస్థితి మరింత దిగజారిందని అతని తమ్ముడు వెంకటరెడ్డి తెలిపారు. రాంచంద్రారెడ్డి మృతదేహాన్ని అప్పగిస్తే తీగలకుంటపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

తమ్ముడి ముఖం చూడక 45 ఏళ్లు.. 

చత్తీస్ గఢ్​అబుజ్ మాడ్ అడవుల్లో ఎన్ కౌంటర్లో అసువులుబాసిన తన తమ్ముడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్  కోస మృతదేహాన్ని తమకు అప్పగించాలని, చివరి చూపునకు అవకాశం కల్పించాలని రిటైర్డ్  ఎంఈవో కరుణాకర్ రెడ్డి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్ రావుపల్లికి చెందిన కరుణాకర్ రెడ్డి ఎంఈవోగా పని చేస్తూ15 ఏళ్ల కింద రిటైర్​ అయి కరీంనగర్ లోని విద్యానగర్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. 

తన తమ్ముడు సత్యనారాయణ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ' నేను 1980 ఏప్రిల్ లో చివరిసారిగా తమ్ముడిని కలిసిన. ఆ తర్వాత 45 ఏళ్లుగా ఇప్పటి వరకు మాతో కమ్యూనికేషన్  లేదు. 1980 లో ఉగాది నాటికే తాను నక్సలైట్లలోకి వెళ్లాలని డిసైడ్  అయినట్లున్నాడు. అందుకే తన ఫొటోలు, సర్టిఫికెట్లు అందుబాటులో లేకుండా తీసుకెళ్లాడు. 

నా తమ్ముడి  ముఖం ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. పోలీసులు మాకు  చివరి చూపునకు అవకాశం కల్పించి డెడ్ బాడీ ఇవ్వాలి. నేను  కోహెడకు చెందిన మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి సోదరుడు కలిసి నారాయణ పూర్ కు వెళ్తున్నాం. గతంలో నంబాల కేశవరావు డెడ్ బాడీని పోలీసులు ఇవ్వలేదు. ఇప్పుడు నా తమ్ముడి డెడ్ బాడీ  ఇస్తరో.. ఇవ్వరో.' అని కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 

కార్మికోద్యమ నాయకుడి నుంచి..

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లికి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస టెన్త్  వరకు ఎల్లారెడ్డిపేటలో చదివాడు. తన అన్న కరుణాకర్ రెడ్డి కరీంనగర్‎లో డిగ్రీ చేస్తుంటే, ఆయనతో ఉంటూ 1973–-75లో కరీంనగర్‎లో ఇంటర్  పూర్తి చేశాడు. ఆ ఇంటర్  బ్యాచ్‎లో తానొక్కడే పాసయ్యాడు. 

ఆ తర్వాత పెద్దపల్లిలో ఐటీఐ పూర్తి చేసి కేశోరాం సిమెంట్‎లో అప్రెంటిషిప్ చేశాడు. ఆ సమయంలోనే ఆయనకు పీపుల్స్ వార్ పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2013లో తన తండ్రి  చనిపోగా.. సత్యనారాయణ రెడ్డి అంత్యక్రియలకు వస్తాడేమోనని గోపాలరావుపల్లిని 200 మంది పోలీసులు చుట్టుముట్టారు.