ఆర్టీసీకిచ్చిన హామీలు తూచ్‌‌‌‌

ఆర్టీసీకిచ్చిన హామీలు తూచ్‌‌‌‌
 • ఆర్టీసీకిచ్చిన హామీలు తూచ్‌‌‌‌
 • ఉద్యోగులకు భోజనం పెట్టి మరీ వరాలు కురిపించిన సీఎం కేసీఆర్‌‌‌‌
 • అయినా పెరిగిన సమస్యలు.. ఉద్యోగులకు తప్పని వేధింపులు
 • కొత్త జాబ్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌పై తీవ్ర వ్యతిరేకత

హైదరాబాద్, వెలుగు: ‘‘ఆర్టీసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం. సంస్థలో చీటికిమాటికి సస్పెండ్‌‌‌‌ చేసే ప్రసక్తే ఉండదు. ఇంక్రిమెంట్లు ఆగవు. ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్స్ ఇస్తం. పీఎఫ్, సీసీఎస్‌‌‌‌ బకాయిలు చెల్లిస్తం’’.. 2019 డిసెంబర్ ఒకటిన ప్రగతి భవన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌ చేసిన కామెంట్లు ఇవి. కానీ ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా సక్కగ అమలు కాలేదు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తర్వాత ప్రగతి భవన్‌‌‌‌లో భోజనం పెట్టి మరీ వరాల జల్లు కురిపించిన కేసీఆర్‌‌‌‌.. తర్వాత పట్టించుకున్న పాపానపోలేదు. 2019 అక్టోబర్, నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగింది. 55 రోజులపాటు ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో ఆఖరికి ఉద్యోగుల డిమాండ్లకు సీఎం కేసీఆర్‌‌‌‌ ఓకే చెప్పారు. సమ్మె తర్వాత ఉద్యోగులతో ప్రగతి భవన్‌లో రోజంతా మీటింగ్ ఏర్పాటు చేశారు. వరాల జల్లు కురిపించారు. వాటిల్లో ఒక్కట్రెండు మినహా ఏవీ అమలు కావడంలేదు..

ఉద్యోగ భద్రత ఉత్తదే
‘‘ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. డ్రైవర్లు, కండక్టర్ల సస్పెన్షన్‌‌‌‌ ఉండదు. వారంరోజుల్లో ఉద్యోగ భద్రత గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ తయారు చేయండి’’ అని సీఎం ఆదేశించి ఏడాదిన్నర కావస్తున్నా.. సర్క్యులర్‌‌‌‌ జారీ చేయలేదు. ఈ మధ్య అనేక మందిని సస్పెండ్‌‌‌‌ చేశారు. మరికొందరిని డిపో స్పేర్‌‌‌‌లో పెట్టారు. కొత్త ఉద్యోగ భద్రత గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ పాత వాటి కంటే ఘోరంగా ఉన్నాయని ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. 

పెండింగ్‌‌‌‌లో ఉన్నవి ఇవే..

 • ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు యథావిధిగా ఇస్తామన్నారు. కానీ ఇప్పటికే రెండు పేస్కేళ్లు, 5 డీఏలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పీఆర్సీ ప్రకటించారు.
 • ఉద్యోగుల పేరెంట్స్‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌లోనే కాకుండా జిల్లాల్లోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌లో కూడా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా అమలు కాలేదు.
 • ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫెసిలిటీ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం డేటా కూడా సేకరించలేదు.
 • సంస్థలో పనిచేస్తున్న టెంపరరీ ఎంప్లాయీస్‌‌‌‌ను పర్మినెంట్‌‌‌‌ చేస్తామని చెప్పి ఒక్కరినీ చేయలేదు. పైగా వంద మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
 • ఉద్యోగుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అతీగతి లేదు. 
 • మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ పట్టించుకోలేదు.

ఆదిలోనే ఆపేసిన్రు

 • ఆర్టీసీలో రెండేండ్ల పాటు యూనియన్లు ఉండవని చెప్పారు. వాటి స్థానంలో ఎంప్లాయీస్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ బోర్డులను తీసుకొచ్చారు. ఒకట్రెండు నెలలు హడావుడి చేశారు. ఇప్పుడు సంస్థలో వెల్ఫేర్‌‌‌‌ బోర్డులు పనిచేయడం లేదు.
 • ఏటా బడ్జెట్‌‌‌‌లో వెయ్యి కోట్లు పెడుతామన్నారు. కేటాయించారు. కానీ విడుదల చేయలేదు.
 • ఎంప్లాయీస్‌‌‌‌ పీఎఫ్‌‌‌‌, సీసీఎస్‌‌‌‌ బకాయిలు చెల్లిస్తామన్నారు. కానీ మొదట్లో కొద్దిమేర ఇచ్చినా ఇప్పుడు బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. సీసీఎస్‌‌‌‌ మూతబడే పరిస్థితికి వచ్చింది.