వైఎస్‌‌ వివేకానంద హత్య వెనుక పెద్దల హస్తం

వైఎస్‌‌ వివేకానంద హత్య వెనుక పెద్దల హస్తం
  • బెంగళూరు స్థలం గొడవే కారణం 
  • దీనివెనక పెద్దల హస్తం కూడా ఉంది 
  • కన్ఫెషన్ స్టేట్ మెంట్​లో వెల్లడించిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి 

కడప: మాజీ మంత్రి వైఎస్‌‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్​గా మారిన ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్​మెంట్​లో పేర్కొన్న సంచలన విషయాలు తాజాగా బయటకొచ్చాయి. కోర్టు సూచన మేరకు దస్తగిరి స్టేట్​మెంట్​ను ఇతర లాయర్లకు సీబీఐ అందజేసింది. బెంగళూరులో స్థలానికి సంబంధించిన గొడవతోనే వివేకా హత్యకు ఎర్రగంగిరెడ్డి ప్లాన్ చేశాడని వెల్లడించాడు. హత్య కోసం రూ. 40 కోట్ల సుపారీ కుదుర్చుకున్నట్లు తెలిపాడు. వివేకా హత్య వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని వివరించాడు. ‘‘ఆర్థికపరమైన అంశాల వల్లే వివేకాను నేను, సునీల్‌‌, ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌‌ రెడ్డి కలిసి హత్య చేశాం. ఎర్రగంగిరెడ్డి మోసం చేయడంతోనే తాను 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయానని వివేకా కోపంతో ఉన్నారు. ఇదే క్రమంలో బెంగళూరులోని ఓ స్థలంపై వివేకాకు, ఎర్రగంగిరెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయి. నేను 2018లో వివేకా వద్ద పని మానేశాను. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 2న నన్ను, సునీల్ యాదవ్​ను, ఉమాశంకర్ రెడ్డిని ఎర్రగంగిరెడ్డి తన ఇంటికి తీసుకెళ్లాడు. వివేకాను హత్య చేయాలని, శంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని, అందులో రూ. 5 కోట్లు నాకు ఇస్తానని చెప్పాడు. మార్చి14న ఎర్రగంగిరెడ్డి, సునీల్‌‌యాదవ్, ఉమాశంకర్‌‌, నేను  వివేకా ఇంట్లోకి గోడ దూకి వెళ్లాం. బెంగళూరు స్థలంలో వివేకాను ఎర్రగంగిరెడ్డి వాటా అడిగారు. మాటామాటా పెరగడంతో వివేకాను సునీల్ యాదవ్ ముఖంపై కొట్టాడు. కిందపడిన వివేకాను ఉమాశంకర్‌‌రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. తర్వాత ఆయన చేత్తోనే లేఖ రాయించాం. సునీల్‌‌, ఉమాశంకర్‌‌ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఆ తర్వాత బాత్రూంలోకి తీసుకెళ్లి వివేకాను గొడ్డలితో నరికి చంపారు. తర్వాత అందరం గోడదూకి పారిపోయాం’’ అని దస్తగిరి వివరించాడు. వివేకా హత్య వెనక అవినాష్‌‌ రెడ్డి, భాస్కర్‌‌ రెడ్డి, మనోహర్‌‌ రెడ్డి, శంకర్‌‌ రెడ్డి ఉన్నారని పేర్కొన్నాడు.