బొగ్గునే నమ్ముకుంటే బుగ్గే..

బొగ్గునే నమ్ముకుంటే బుగ్గే..

ఇంధన వనరుల్ని మార్చాలె
కరోనా తర్వాత పారిశ్రామికంగా ఉత్పత్తి పెరిగి కరెంట్ కు డిమాండ్​పెరిగింది. ఇటు వేసవి దృష్ట్యా విద్యుత్​వాడకం ఎక్కువైంది. దేశంలో పవర్​ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గి డిమాండ్​మేరకు కరెంట్​ సరఫరా జరగడం లేదు. ఉత్తరాన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌‌ సహా పలు రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిది గంటల మేర కరెంట్​ కోతలు పెడుతున్నాయి. మెటల్స్, సిమెంట్​ఉత్పత్తి చేసే పెద్ద ఇండస్ట్రీలు సహా టెక్స్​టైల్స్​ మిల్లులు, ఇతర చిన్న పరిశ్రమలపై కరెంట్​ కోతల ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇండ్లల్లో విద్యుత్​ వినియోగదారులు ఎండ ఉక్కపోతను తట్టుకోలేక డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఒక బొగ్గుపైనే ఆధారపడేతే పరిస్థితి ఇలాగే ఉంటుంది.అందుకే ఇంధన వనరుల్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేశీయంగా బొగ్గు ఉత్పత్తి తక్కువగా ఉండటం, రవాణా పరిమితుల వల్ల కొద్ది సంఖ్యలోనే రైలు క్యారేజీలు నడవడం, సముద్ర కార్గో రేట్ల పెరుగుదలతో విదేశీ దిగుమతులు తగ్గడం లాంటి కారణాలతో ఇండియాలో గల అన్ని పవర్​ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఏప్రిల్ 18 నాటికి విద్యుత్ ఉత్పత్తిదారుల వద్ద సగటున తొమ్మిది రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇండియాలో ఆయా రాష్ట్రాల్లో కరెంట్​కోతలు కొత్త కానప్పటికీ ప్రస్తుత పరిస్థితి ముంచుకొస్తున్న విద్యుత్​సంక్షోభాన్ని సూచిస్తోందని ఆల్​ ఇండియా పవర్​ ఇంజనీర్స్ ​ఫెడరేషన్​ చైర్మన్​ శైలేంద్ర దూబే అంటున్నారు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్​ యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్​ ధరలు పెరిగాయి. ఆ ప్రభావంతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పాలసీ మేకర్లు పెరిగే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని చూస్తుండగా.. ఇప్పుడు బొగ్గు కొరత రూపంలో మరో కొత్త సమస్య దానికి తోడు కాబోతుంది. శిలాజ ఇంధనాల ద్వారానే దేశంలో 70 శాతం పవర్​ జనరేట్​అవుతుంది. బొగ్గు కొరత వల్ల వచ్చే విద్యుత్​ సంక్షోభం దేశ 2.7 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. 
పరిశ్రమలపై ప్రభావం..
బొగ్గు కొరతతో తలెత్తుతున్న కరెంట్ సమస్య పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెటల్స్, సిమెంట్, ఇతర మిశ్రమాలు ఉత్పత్తి చేసే పెద్ద ఇండస్ట్రీలు మార్కెట్​లో విద్యుత్​కొనుగోలు కోసం ఎక్కువ మొత్తం నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. నోమురా హోల్డింగ్స్ సంస్థ ప్రకారం.. నిరంతర బొగ్గు కొరత దేశ పారిశ్రామిక ఉత్పత్తికి భారంగా మారుతుంది. కొరతకు సంబంధించి డిమాండ్, సరఫరా రెండింటిది సమాన బాధ్యత ఉంటుందని సోనాల్​వర్మ నేతృత్వంలోని ఆర్థిక వేత్తలు బృందం ఒకటి ఏప్రిల్​19న రాసిన ఓ స్టడీలో పేర్కొంది. దేశంలో వేసవి​ ప్రారంభం కావడంతోనే విద్యుత్​డిమాండ్​ బాగా పెరిగింది. అయితే బొగ్గు రవాణా చేయడానికి రైల్వే ర్యాకుల లభ్యత తగ్గడంతో పాటు బొగ్గు దిగుమతులు కూడా తగ్గాయి. దీని వల్ల డిమాండ్​కు తగ్గట్లుగా విద్యుత్​ఉత్పత్తి లేక ప్రభుత్వాలు గంటలపాటు కరెంట్​ కోతలు పెడుతున్నాయి. 
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 9న 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఐదేండ్లలో అత్యంత ఎండ ఉన్న రోజు ఇది. టెంపరేచర్​ పెరిగే కొద్దీ విద్యుత్​ డిమాండ్​ కూడా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో డిమాండ్​ మేరకు కరెంట్​సరఫరా చేయలేక ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయి. విద్యుత్​ఎక్స్చేంజీలో యూనిట్​ధర కూడా గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగింది. ఒకవైపు పారిశ్రామిక ఉత్పత్తి పునరుద్ధరణ తర్వాత విద్యుత్​డిమాండ్ పెరగగా, ఇప్పుడు వేసవిలోనూ కరెంట్​వాడకం పెరగడంతో డిమాండ్​కు తగ్గ సరఫరా జరగడం లేదు. మార్చి 2021 నాటికి స్థూల దేశీయోత్పత్తి 6.6 శాతం తగ్గిపోయిన తర్వాత దేశం తిరిగి వృద్ధి సాధించాలని ఆశించింది. అయితే ద్రవ్యోల్బణం మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. ఇది సెంట్రల్ బ్యాంక్ అంచనాల లక్ష్యం 6 శాతం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. 
టెక్స్​టైల్​ మిల్లులు..
కరెంట్​ కోతల వల్ల దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని కొన్ని టెక్స్‌‌టైల్ మిల్లులు ఉత్పత్తి బంద్ ​పెట్టాయి. కరెంట్​ కోతలతో ఉత్పత్తి చేయడం లేదని, పెరిగిన ధరల దృష్ట్యా డీజిల్‌‌తో నడిచే జనరేటర్లు వాడలేని పరిస్థితి ఉందని ఇతర ప్రత్యామ్నాయాలు కూడా పెద్దగా లేవని కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అతుల్ గణత్రా తెలిపారు. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలదీ అదే పరిస్థితి. తరచూ కరెంట్​ కోతలతో డీజిల్​జనరేటర్​ వాడకం పెరిగి తమకు వచ్చిన దాంట్లో ఎక్కువ మొత్తం డీజిల్​కే వెచ్చించాల్సి వస్తోందని బిహార్​లోని మెకానిక్​ షాపుల ఓనర్లు వాపోయారు. 
తగ్గిన బొగ్గు నిల్వలు..
ఇండియాలో గల అన్ని పవర్​ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఏప్రిల్ 18 నాటికి విద్యుత్ ఉత్పత్తిదారుల వద్ద 9 రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో ఉత్పత్తిని 27 శాతం పెంచినప్పటికీ, ఆసియాలోని అతిపెద్ద బొగ్గు గనులు నిర్వహిస్తున్న ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్ కరెంట్​డిమాండ్​కు తగినట్లుగా ఉత్పత్తి పెంచలేకపోయింది. రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్లు బొగ్గు కొరతతో సతమతమవుతున్నాయని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ చైర్మన్​ దూబే బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోల్ ఇండియా ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టకపోవడం కారణంగా వేసవిలో బొగ్గు కొరత చాలా కాలంగా ఒక సాధారణ వ్యవహారంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాతో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గినప్పుడు కరెంట్​డిమాండ్​ కూడా తగ్గింది. అప్పుడు విద్యుత్​సమస్యేమీ రాలేదు. కానీ ఇప్పుడు పరిశ్రమలు వాటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున తిరిగి డిమాండ్​ పెరిగింది. నైరుతి రుతుపవనాలు మొదలైతే వర్షాలతో మైన్స్​లో బొగ్గు తీయలేని పరిస్థితి ఉంటుందని, రోడ్లు కూడా రవాణాకు అంత బాగుండవని అప్పుడు బొగ్గు కొరత మరింత తీవ్రమయ్యే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.ఈ పరిస్థితుల్లో.. 2070 నాటికి జీరో న్యూట్రాలటీ దిశలో సరైన అడుగులు పడతాయా? అన్నది సందేహం. సదా బొగ్గుపై ఆధారపడే పరిస్థితి తప్పి, సౌర, పవన విద్యుత్​వంటి పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి– సామర్థ్యాల్నీ పెంచుకోకపోతే మన భవిష్యత్​ అంధకారమే. పాలకులారా తస్మాత్​ జాగ్రత్త!.
-‌‌‌‌ ఎడిటోరియల్​​ డెస్క్​