కొనుడూ లేటే.. పైసలిచ్చుడూ లేటే

కొనుడూ లేటే.. పైసలిచ్చుడూ లేటే
  • కొనుగోలు కేంద్రాల్లో వడ్లమ్మి రైతుల తిప్పలు

హైదరాబాద్, వెలుగు: వడ్లు అమ్మడం నుంచి పైసలు చేతికొచ్చేదాకా రైతులకు అడుగడుగునా తిప్పలే ఎదురైతున్నయి. కుప్పల కాడ రోజుల తరబడి పడిగాపులు గాచి వడ్లమ్ముకుంటే ఆ పైసల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. వడ్లు కాంటా పెట్టిన 48 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తమని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 15, 20 రోజులకు కూడా వాళ్లకు డబ్బులు అందడం లేదు. కొన్ని జిల్లాల్లో నెల రోజులైనా పైసలు పడ్తలేవు. దీంతో యాసంగి పెట్టుబడులకు, పాత అప్పులు తీర్చడానికి తిప్పలైతున్నదని రైతులు ఆవేదన పడుతున్నారు. పైసలు పడ్డాయా లేదా అని రోజూ బ్యాంకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 6,650 సెంటర్ల ద్వారా వడ్లు కొనాలని సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్​ శాఖ మొదట నిర్ణయించింది. డిమాండ్ ​దృష్ట్యా ఐకేపీ సెంటర్లు, మార్కెట్​యార్డులు, పీఏసీఎస్ సొసైటీలు కలిపి 6,894 సెంటర్లు తెరిచారు. వీటి ద్వారా వానాకాలం సీజన్‌లో 1.03 కోట్ల టన్నుల వడ్లు కొనాలన్నది టార్గెట్. కానీ మంగళవారం నాటికి 61.52 లక్షల టన్నులు మాత్రమే కొన్నారు. వడ్లు అమ్మిన రైతుల్లో సగం మందికి ఇప్పటి వరకు పైసలు పడలేదు. సెంటర్లలో ధాన్యాన్ని తూకమేసి కొనుగోలు వివరాలతో  పాటు పట్టాదార్​ పాస్ పుస్తకం, ఆధార్‌‌, బ్యాంకు ఖాతా వివరాలను ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేసి ట్రక్‌‌ షీట్‌‌ ఇవ్వాలి. కానీ సెంటర్ల నిర్వాహకులు తూకాన్ని ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయకుండా రైతులకు ఎక్నాలెజ్ మెంట్‌‌ అని రసీదు ఇచ్చి లారీలను మిల్లర్లకు పంపుతున్నరు. ధాన్యం దించుకుని మిల్లర్లు చెక్‌‌ చేసుకుని ఓకే అన్న తరువాతే రైతులకు ట్రక్ షీట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సెంటర్లతోపాటు మిల్లుల్లోనూ తరుగు సాకుతో కింటాపై నాలుగైదు కిలోలు దోపిడీ చేస్తున్నారు. ఈ తతంగానికి 20 నుంచి 25 రోజులు పడుతున్నది. యాసంగి సీజన్​ మొదలవడంతో రైతులు నారు మళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇతర పంటలకు దుక్కులు దున్నుతున్నారు. సీజన్‌లో ట్రాక్టర్ల కిరాయి, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఎకరాకు కనీసం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. దీనికి తోడు అప్పుల భారం 
రైతులను వెంటాడుతోంది. వడ్ల పైసలు టైముకు చేతికి రాక కొత్త అప్పులు, చే బదుళ్లు తీసుకోవాల్సి వస్తున్నది.
20 రోజులైతున్నా పైసలు రాలే
తాడ్వాయి సింగిల్ విండో కేంద్రంల 20 రోజుల కింద వడ్లమ్మిన. వారంల పైసలు పడ్తయన్నరు. ఇప్పటికీ రాలే. ఏమైందని సార్లను ఏ రోజు అడిగినా రేపు అకౌంట్లకు కొడ్తమంటున్నరు. కాని వస్తలేవు.- బత్తిని లక్ష్మీనారాయణ,  మునగాల, సూర్యాపేట
15 రోజులు అవుతున్నా పైసలు పడలే
42 క్వింటాలు అమ్మి 15 రోజులు దాటినా నా ఖాతాల పైసలు పడలే. నల్లగున్నయని నెల రోజుల దాకా సెంటర్లనే సతాయించిన్రు, బస్తాకు కిలో అదనంగా కట్ చేస్కొని తూకమేసిన్రు, ఇప్పటికీ పైసలియ్యక యాసంగి పెట్టుబళ్లకు, పాత అప్పులు కడ్తానికి ఇబ్బందైతున్నది. -పూరెల్ల శ్రీకాంత్ గౌడ్, రామడుగు, కరీంనగర్.
ఇయ్యాల,రేపు అంటున్రు
రెండెకరాల్లో 80 సంచులు పండించిన. 15న ఇబ్రహీంపట్నం సొసైటీ ఆధ్వర్యంలోని కేంద్రంలో అమ్మిన. కాంటా చేసి 15 రోజులు అవుతున్నా ఇంకా పైసలు అకౌంట్లపడలే. ఆఫీసర్లను అడిగితే ఇయ్యాల, రేపు అంటున్రు. -బద్దంకి శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీంపట్నం.
పెట్టుబడులకు పైసల్లేవ్వు
నా వడ్లమ్మి 15 రోజులైతున్నా ఇంకా పైసలు పడలే. సెంటరోళ్లను అడుగుతే ఇప్పుడు, అప్పుడు అంటున్రు. అంతా నార్లు పోసి దున్నుకుంటున్నరు. నాకు నారుకు విత్తనాలు తెద్దామన్నా పైసల్లెవ్వు. - దాసరి మల్లేశ్, కోటి లింగాల, వెల్గటూర్.
పైసలు ఎప్పుడొస్తయో..
290 బస్తాల వడ్లు అక్టోబర్ చివర్లో కేంద్రానికి తీస్కపోయిన. ఈనెల మొదటివారంల కాంటా పెట్టిన్రు. నాకు, ఈ కేంద్రంల కాంటా పెట్టిన మొత్తం 80 మంది రైతులకు ఇప్పటిదాక పైసలు రాలే. ఎప్పుడొస్తయో అర్థమైతలేదు. -పరంథామ, నాతాళ్లగూడెం(వలిగొండ).