హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సొంత బలం సరిపోదని, ఇతర పార్టీల్లో గెలిచే అవకాశం ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవాలని హైకమాండ్ రాష్ట్ర పార్టీని ఆదేశించింది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై అంతర్గతంగా సర్వే చేసిన సెంట్రల్ పార్టీ ఆ రిపోర్టును రాష్ట్ర పార్టీకి పంపించింది. అందులో ఏ నియోజకవర్గంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో వారి పేర్లను కూడా తెలియజేస్తూ.. వీరిని పార్టీలోకి చేర్చుకోవడంపై సీరియస్ గా దృష్టి పెట్టాలని కూడా కోరింది. గోవా ఫార్మూలాను తెలంగాణలో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు బయటివారిని చేర్చుకోవడం ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించి, ఇతర పార్టీల వారిని మెప్పించి బీజేపీలోకి తీసుకోవడమే గోవా ఫార్ములా అని పార్టీ నేతలు చెపుతున్నారు.
బయటి నుంచి ఫలానా లీడర్ వస్తే ఆ నియోజకవర్గంలో నాకు టికెట్ రాదని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని, గెలిచే వారు ఎవరైనా సరే పార్టీలోకి చేర్చుకోవాల్సిందేనని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ఇదే సమయంలో బయటి వారి చేరికపై అసంతృప్తిని వ్యక్తం చేసే పార్టీ సీనియర్ నేతలను ఒప్పించే బాధ్యతను కూడా రాష్ట్ర పార్టీ తీసుకోవాలని సూచించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన సెకండ్ క్యాడర్ ను గుర్తించి వారిని కూడా తీసుకోవాల్సిందేనని ఆ రిపోర్టులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ని కోరింది.
