ప్రపంచాన్ని భయపెడుతున్న ఊబకాయం: అప్పుడు ధనిక దేశాలు.. ఇప్పుడు పేద దేశాలు!

ప్రపంచాన్ని భయపెడుతున్న ఊబకాయం: అప్పుడు ధనిక దేశాలు.. ఇప్పుడు పేద దేశాలు!

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఎలా పెరుగుతోందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక భారీ పరిశోధన చేశారు. 'నేచర్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 200 దేశాలకు చెందిన దాదాపు 23 కోట్ల మంది వివరాలను పరిశీలించారు. గత 45 ఏళ్లలో (1980 నుండి 2024 వరకు) మనుషుల ఎత్తు, బరువుల్లో వచ్చిన మార్పులను బట్టి ఈ నివేదిక ఇచ్చారు.

అమెరికా, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి ధనిక దేశాల్లో (High-income countries) గతంలో ఊబకాయం ఎక్కువగా ఉండేది. కానీ 1990వ దశకం నుండి అక్కడ పిల్లలు, యువతలో ఊబకాయం పెరగడం నెమ్మదించింది. ప్రస్తుతం అక్కడ ఇది ఒక స్థాయికి వచ్చి స్థిరంగా కొనసాగుతోంది.

మనలాంటి తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో పరిస్థితి వేరుగా ఉంది. ఇక్కడ ఊబకాయం రేటు ఏమాత్రం తగ్గకుండా వేగంగా పెరుగుతూనే ఉంది. రొమేనియా, బ్రెజిల్ వంటి దేశాల్లో పెద్దవారిలో 30-40 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.  పశ్చిమ ఐరోపా దేశాల్లో 1990ల నుండే ఈ పెరుగుదల నెమ్మదించింది. ప్రస్తుతం అక్కడ పెద్దవారిలో 11-23 శాతం, పిల్లల్లో 4-15 శాతం మంది మాత్రమే ఊబకాయంతో ఉన్నారు.

ఎందుకు ఈ తేడాలు?
ధనిక దేశాల్లో ఆహారం దొరికే విధానం, ప్రజల ఆర్థిక స్థితిగతులు,  ఆరోగ్యకరమైన ఆహారంపై ఉన్న అవగాహన వల్ల అక్కడ ఊబకాయం నియంత్రణలోకి వచ్చింది. కానీ పేద, మధ్యతరగతి దేశాల్లో సరైన ప్రభుత్వ విధానాలు, పోషకాహార లభ్యతపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల పరిస్థితి దారుణంగా మారుతోంది.

►ALSO READ | ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో త్వరగా ఫేమస్ అవుతారు!

దీన్ని అరికట్టడం ఎలా?
ఊబకాయం ఇప్పుడు ఒక 'మహమ్మారి'లా మారింది. ప్రతి దేశం తన జనాభాకు తగ్గట్టుగా ప్రత్యేక ఆరోగ్య పాలసీలను రూపొందించాలి.  ముఖ్యంగా పేద దేశాల్లో జనం తీసుకునే ఆహారం, వారి జీవనశైలిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల్లో ఊబకాయం తగ్గితేనే, భవిష్యత్తులో అది పెద్దవారిలో తగ్గడానికి అవకాశం ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
 
ఏ దేశంలో ఊబకాయం ఎలా పెరుగుతోంది ? ఏ కారణాల వల్ల పెరుగుతోంది? అని వివరంగా అర్థం చేసుకుంటేనే దాన్ని అరికట్టే మందులు లేదా పద్ధతులు కనిపెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.