తప్పులు లేకుండా ప్రతి రోజు కరోనా హెల్త్ బులిటెన్ ఇవ్వాలి

తప్పులు లేకుండా ప్రతి రోజు కరోనా హెల్త్ బులిటెన్ ఇవ్వాలి

క‌రోనా కేసులు, క‌రోనా హెల్త్ బులెటిన్ కు సంబంధించి మంగ‌ళ‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. సీఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌భుత్వ నివేదికను స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కరోనాపై జారీ చేసే హెల్త్‌ బులిటిన్‌ను తప్పులు లేకుండా ఇవ్వాల‌ని, క‌రోనా స‌మాచారాన్ని ప్రతి రోజు ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అలాగే ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్‌ను తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్‌ను వాడుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

కరోనా బాధితుల కోసం 857 హోటల్స్ గదుల్లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు. కోవిడ్ బారిన పడిన 248 మంది ప్రస్తుతం హోటల్ గదుల్లో ఉన్నారని, కోవిడ్ పేషెంట్‌ల‌ను హాస్పిట‌ల్‌లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభతరం చేస్తామని చెప్పారు. గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పని సరిగా అమలు చేస్తామ‌ని, రిపోర్టు సమర్పిస్తామ‌ని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల రాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశామ‌ని కోర్టుకు తెలిపారు.

MRI, CT స్కాన్ ల పై ప్రైవేట్ హాస్పిటల్ లో ఛార్జ్ ల విషయం పై ప్రైవేట్ హాస్పిటల్ ల వారితో చర్చిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటి వరకు ప్రయివేటు హాస్పిటల్స్ వైద్యం పై 726 ఫిర్యాదులు అందాయని, వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని చెప్పారు. ప్రతి రోజు కరోనా పై పూర్తి సమాచారాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తప్పనిసరిగా అందిస్తామ‌ని చెప్పారు. ప్రతి హాస్పిటల్స్ వద్ద డిస్‌ప్టే బోర్డ్లను ఏర్పాటు చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో ఎక్కువగా 21-50 ఏళ్ల వయస్సు గల వారే కరోనా బారిన పడుతున్నారని, దీనిని నివారించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామ‌న్నారు.

ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. రాపిడ్ కిట్లతో రిజ‌ల్ట్‌ 40 శాతం మాత్రమే కరెక్ట్ గా వస్తుందని, రాజస్థాన్ లో రాపిడ్ కిట్ల వాడకం ఇప్పటికే ఆపేశారని తెలిపింది. రాష్ట్రంలో రాపిడ్ కిట్ల వాడకం పై నిపుణుల‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేసి మరోసారి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని అదేశించింది. త‌దుపరి విచారణ ఆగస్ట్ 13 కు వాయిదా వేసింది.

The High Court directed the Telangana government to issue the Corona Health Bulletin every day without any mistakes.