
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు
- 29న సింగిల్ జడ్జికి ప్రైమరీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశం
- దర్యాప్తు సమాచారం బయటకు వస్తే సిట్ చీఫ్‌దే బాధ్యతని హెచ్చరిక
- ఆడియోలు, వీడియోలు టీఆర్ఎస్ చీఫ్‌కు ఎలా చేరాయి? అవి నాకూ పంపారన్న చీఫ్ జస్టిస్
- క్షమాపణలు చెప్పిన సర్కార్ తరఫు లాయర్
- రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవద్దని కామెంట్
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్జి (జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి) పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగాలని ఉత్తర్వులు ఇచ్చింది. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్.. దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సింగిల్ జడ్జికి నివేదించాలని ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి తొలుత ఉత్తర్వులు ఇచ్చి, తర్వాత వాటిని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి రిట్ అప్పీల్ పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
దాదాపు 45 నిమిషాల పాటు వాదనలు కొనసాగాయి. తర్వాత జడ్జిలు చర్చించుకొని తీర్పు ఇచ్చారు. సీబీఐ విచారణకు నిరాకరించారు. కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు సాగుతుందని చెప్పారు. ఇంతటితో బీజేపీ రిట్ పరిష్కారమైనట్లు ప్రకటించారు. ‘‘దర్యాప్తుపై ఎప్పటికప్పుడు సీల్డ్ కవర్ లో రిపోర్టును సింగిల్ జడ్జికి అందజేయాలి. ఈ నెల 29న అప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై తొలి రిపోర్టు ఇవ్వాలి. స్వాధీనం చేసుకున్న మెటీరియల్స్ పై వివరాలు ఇవ్వాలి. ఈ కేసు దర్యాప్తు బాధ్యత పూర్తిగా సీపీ సీవీ ఆనంద్ దే. దర్యాప్తు వివరాలు రాజకీయ నాయకులు, మీడియాకు, ఆఖరికి తన ఉన్నతాధికారులకు కూడా చెప్పొద్దు. సమాచారం బయటకు వస్తే సీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీజేకే సీల్డ్ కవర్ పంపడం వెగటు పుట్టించేదే : దుష్యంత్ దవే
ఈ కేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఎలా చేరాయని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘అక్టోబర్ 26న ఘటన జరిగితే, అదే రోజు పంచనామా చేశారు. కానీ పంచనామాలో ఆ తర్వాత రోజు (అక్టోబర్ 27న) మీడియేటర్ల సంతకాలు ఉన్నాయేంటి. దర్యాప్తు సమాచారమంతా బయటకు ఎలా లీకైంది?” అని అడిగింది. ‘‘టీఆర్‌ఎస్ అధినేత నుంచి తన ఆఫీసుకు ఒక సీల్డ్ కవర్ వచ్చింది. అందులో సీడీ, పెన్‌డ్రైవ్ మొదలైనవి ఉన్నాయి. ఇదే తరహా కవర్ వేరే చీఫ్ జస్టిస్‌కు కూడా అందింది” అని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. దీనిపై రాష్ట్ర సర్కార్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దుష్యంత్ దవే స్పందిస్తూ.. సమాచారం లీక్ కావడం, వేరే వాళ్లకు చేరడం దురదృష్టకరమని అన్నారు.
ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. సీజేకే సీల్డ్ కవర్ పంపడం వెగటు పుట్టించేదే అని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేయడం శోచనీయమన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఏజీకి సలహా ఇస్తామన్నారు. టీఆర్‌ఎస్ చీఫ్ నుంచి వచ్చిన సీల్డ్ కవర్‌ను పట్టించుకోవద్దని కోరారు. ఈ క్రమంలో పిటిషనర్ తరఫు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ వైద్యనాథన్ స్పందిస్తూ.. ‘‘ఆ విధంగా సీల్డ్ కవర్ పంపడం కోర్టు ధిక్కారమే అవుతుంది. అది కోర్టులను ప్రభావితం చేయడమే. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
ఇదో బూటకపు కేసు: వైద్యనాథన్
తొలుత వైద్యనాథన్ వాదిస్తూ.. బీజేపీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కేసు బనాయించారని తెలిపారు. అయితే ఈ కేసులో బీజేపీ వాళ్లు నిందితులు కానప్పుడు రిట్ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్నించింది. పోలీసులు నమోదు చేసిన కేసులో బీజేపీ పేరును అనేకసార్లు ప్రస్తావించారని, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే అలా చేశారని, అందుకే తాము రిట్ వేశామని వైద్యనాథన్ చెప్పారు. ఈ కేసులో నిందితులైన ముగ్గురు కూడా రిట్ వేశారన్నారు. ‘‘దర్యాప్తును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడం అన్యాయం. తుది ఉత్తర్వులు వచ్చే వరకు దర్యాప్తును ఆపాలి” అని కోరారు. అయితే దర్యాప్తు ఆపాలని ఎలా కోరతాని కోర్టు ప్రశ్నించగా.. దర్యాప్తును నిలిపివేయాలని కోరడం లేదని, ఏకపక్షంగా జరిగే రాష్ట్ర పోలీసుల దర్యాప్తును ఆపేసి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
‘‘ఇదో బూటకపు కేసు. ఈ కేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు మీడియాకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విడుదల చేశారు. దీన్ని బట్టి దర్యాప్తు ఎలా జరుగుతుందో అర్థమవుతోంది” అని చెప్పారు. స్పందించిన దుష్యంత్ దవే.. క్రిమినల్ కేసు దర్యాప్తును ఆపాలని కోరే అర్హత ఎవరికీ లేదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. బీజేపీ అప్పీల్ ను డిస్మిస్ చేయాలని కోరారు.