చిట్టచివరి కార్మికుడు ఇల్లు చేరేవరకూ..ఆర్డర్లు ఇస్తూనే ఉంటం

చిట్టచివరి కార్మికుడు ఇల్లు చేరేవరకూ..ఆర్డర్లు ఇస్తూనే ఉంటం

హైదరాబాద్​, వెలుగు:చిట్టచివరి వలస కార్మికుడు ఇంటికి చేరే వరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇస్తూనే ఉంటామని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో పదే పదే జోక్యం చేసుకుంటున్నామన్న భావన వద్దని స్పష్టం చేసింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులు లాక్​డౌన్​తో రాష్ట్రంలో చిక్కుకుపోయారని, వారిని సొంతూళ్లకు పంపించే ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన రెండు పిల్స్​ను హైకోర్టు శుక్రవారం విచారించింది. వలస కార్మికుల తరలింపుపై ఉత్తర్వులివ్వాలన్న మరో పిటిషన్​ విచారణను వాయిదా వేసింది. వలస కార్మికులను తరలించే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చీఫ్​ జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​, జస్టిస్​ విజయ్​సేన్​రెడ్డితో కూడిన బెంచ్​ స్పష్టం చేసింది. రైల్వే శాఖతో కలిసి వలస కార్మికులను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. వలస కార్మికులను పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అడ్వకేట్​ జనరల్​ బీఎస్​ ప్రసాద్​ తెలిపారు. వివిధ ప్రాంతాలకు 133 టికెట్లు కేటాయించామని, ఇకపైనా టికెట్లు ఇచ్చి, వలస కార్మికులు పంపించేందుకు ప్రయత్నిస్తామని రైల్వే తరఫు లాయర్​ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులు మెడపై కత్తి పెట్టినట్లు ఉండకూడదంటూ పేర్కొనడాన్ని బెంచ్​ తప్పుబట్టింది.

‘ఓల్డేజ్ హోమ్స్’పై హెల్ప్ లైన్: ప్రభుత్వం

ఓల్డేజ్ హోమ్స్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు 14567 నెంబర్‌‌‌‌తో హెల్ప్‌‌‌‌ లైన్‌‌‌‌ ఏర్పాటు చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలిచ్చామని చెప్పింది. ఓల్డేజ్ హోమ్స్ నిర్వహణకు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ఏర్పాటు చేశామంది. అనుమతులు లేని ఓల్డేజ్ హోమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చామని, ఈ నెల 30 నుంచి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌‌‌‌ డి.దివ్య శుక్రవారం హైకోర్టుకు రిపోర్టు అందజేశారు. ఓల్డేజ్ హోమ్స్ లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఫైల్ అయిన పిల్ పై ఆమె కౌంటర్ పిటిషన్ వేశారు. ఓల్డేజ్ హోమ్స్ పై పీఎస్ ల వారీగా సర్వే చేయాలని పోలీసులను ఆదేశించామని దివ్య తెలిపారు.

కాంగ్రెస్ నేతల అరెస్టుపై తీర్పు రిజర్వ్

కాంగ్రెస్ లీడర్లను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా 11 మంది నాయకులు ఫైల్ చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. త్వరలో తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని లాయర్ రచనారెడ్డి వాదించారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.

 

వింబుల్డన్ మాజీ చాంప్ కు కరోనా