121 జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు 

121 జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో నంబర్​121 అమలును హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్దుబాటు జీవో చట్ట వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. జీవోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్‌‌‌‌లోని 4(1)కి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వేరే శాఖల్లోని ఉద్యోగాల్లో చేరని వాళ్లను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జీవో 121పై స్టే విధిస్తూ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మధ్యంతర ఆదేశాలిచ్చింది. రూల్స్‌‌‌‌ రూపొందించకుండానే ఫైనాన్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చిన జీవో ద్వారా వీఆర్వో పోస్టులు రద్దు చేశారని, జీవో 121 చట్ట విరుద్ధంగా ఉందని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. జీవోను సవాల్‌‌‌‌ చేస్తూ వీఆర్వో రెవెన్యూ ఆఫీసర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ జి.సతీశ్, మరొకరు వేసిన రిట్‌‌‌‌పై సోమవారం విచారించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.

సర్కార్​వి తప్పుడు లెక్కలు: వీఆర్వోల జేఏసీ

వీఆర్వోలు 98 శాతం మంది లాటరీ ద్వారా కేటాయించిన శాఖల్లో విధుల్లో చేరారంటూ ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వీఆర్వో సంఘాల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, కో చైర్మన్ జే రవి నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీఆర్వోల ఉద్యోగ భద్రత అంశాన్ని తేల్చకుండానే వెంటనే ఇతర శాఖల్లో చేరాలంటూ కలెక్టర్లు, అడిషన్ కలెక్టర్లు, తహసీల్దార్ల ద్వారా సీఎస్ సోమేశ్ కుమార్ తమపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు.