ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ
  • పోలీసులు దర్యాప్తు చేయొద్దు
  • ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో గత ఉత్తర్వులను కొనసాగించిన హైకోర్టు
  • సీబీఐ దర్యాప్తు కోరుతూ నిందితుల రిట్​
  • తీన్మార్​ మల్లన్న ఇంప్లీడ్​ పిటిషన్​
  • అన్నింటిని కలిపి విచారిస్తామన్న జడ్జి

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును వాయిదా వేయాలన్న తమ ఉత్తర్వులను రద్దు చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులో నిందితులను పోలీసుల కస్టడీకి తీసుకుని విచారణ చేసేందుకు ఆ ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దర్యాప్తు నిలిపివేత ఉత్తర్వులను రద్దు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ఈ నెల 7న జరిగే విచారణలో తేల్చుతామని ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

అర్హత ఉంటేనే ముందుకు 
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటు చేసే సిట్‌‌‌‌కు ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర జనరల్‌‌‌‌ సెక్రటరీ జి.ప్రేమేందర్‌‌‌‌ రెడ్డి దాఖలు చేసిన రిట్‌‌‌‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇది చాలా సున్నితమైన కేసు అని, దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్న కేసు అని జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ కేసులో రాజేంద్రనగర్‌‌‌‌ ఏసీపీ 214 పేజీల కౌంటర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై తమ వాదనలు చెప్పడానికి సమయం కావాలని బీజేపీ జనరల్‌‌‌‌ సెక్రటరీ తరఫున న్యాయవాదులు కోరారు. ఇదొక సంచలన కేసు అని, జాతీయంగా ప్రభావం చూపే కేసని, వాయిదా కోరితే ఎలాగని న్యాయమూర్తి ప్రశ్నించారు.

నిందితులు కాని వాళ్లు ఒక పార్టీకి చెందిన వాళ్లు కేసు ఎలా వేస్తారని అదనపు ఏజీ అభ్యంతరం తెలిపారు. దర్యాప్తును వాయిదా వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి కల్పించుకుని, కేసుకు విచారణ అర్హత ఉంటేనే ముందుకు వెళ్తామన్నారు. అన్ని వివరాలు ఉన్నట్లుగా తేలితేనే ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఒక కేసులో ఇద్దరు జడ్జిలు వేర్వేరు ఉత్తర్వులిచ్చారని, ఒక కేసులో నిందితులను రిమాండ్‌‌‌‌కు పంపారని, తమ ముందున్న కేసులో దర్యాప్తు వాయిదా వేశామని గుర్తు చేశారు.

ఆ ఉత్తర్వులు ఇప్పుడే రద్దు చేయలేం
వీడియోలు, ఆడియోలను విడుదల చేయకుండా మీడియా, ఇతరులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కేసులో నిందితుడు కోరె నందకుమార్‌‌‌‌ భార్య చిత్ర లేఖ రిట్‌‌‌‌ దాఖలు చేశారు. నిందితులైన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ శుక్రవారం మరో రిట్‌‌‌‌ వేశారు. తీన్మార్‌‌‌‌ మల్లన్న ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేశారు. అన్నింటినీ కలిపి ఈ నెల 7న విచారిస్తామని, దర్యాప్తుపై తమ ఉత్తర్వులను ఇప్పుడే రద్దు చేయలేమని జడ్జి చెప్పారు.