రూ.500 కోట్ల విడుదలపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశం

రూ.500 కోట్ల విడుదలపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశం

తెలంగాణ రాష్టంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ర్ట ప్రభుత్వ నివేదికపై పిటిషనర్స్ తరపు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తెలంగాణలోని ఆరు జిల్లాలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పిటిషనర్స్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిర్మల్, కొమురం భీమ్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలో వర్షాలు, వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.

జులై 19వ తేదీన వర్షాల గురించి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ర్ట ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్స్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. మోరంచపల్లి, జంపన్న వాగులో చిక్కుకున్న ప్రజలు తమను కాపాడాలంటూ దాదాపు 14 గంటలు ప్రాధేయపడినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల 16 మంది చనిపోయారని చెప్పారు. ఐదుగురిని రక్షించారని చీఫ్ సెక్రటరీ చెబుతున్న మాటలు అవాస్తవమని పిటిషనర్స్ తరపు న్యాయవాదులు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా నష్టం వాటిల్లినా..వాటి గురించి మాత్రం ప్రభుత్వ నివేదికలో పొందుపర్చలేదని కోర్టుకు వివరించారు. కడెం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని న్యాయస్థానం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కడెం ప్రాజెక్టు కింద 172 గ్రామాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. 

రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన రూ.500 కోట్లు ఎవరికి ఇస్తున్నారు..? వరద బాధితులకు ఎలాంటి సహాయం అందించారు..? వంటి విషయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంటూ వ్యాధులు ప్రబలకుండా రాష్ర్ట ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.