వీఆర్వోల సర్దుబాటుపై సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు

వీఆర్వోల సర్దుబాటుపై సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. వీఆర్వోల సంఘం వేసిన పిటిషన్ ను విచారించిన  హైకోర్టు  సీజే ఉజ్వల్ భూయాన్ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 99 శాతం మంది వీఆర్వోలు విధుల్లో చేరారని, ఇంకా 56 మంది వీఆర్వోలు మాత్రమే ఇతర విభాగాల్లో చేరాల్సి ఉందని ప్రభుత్వం తరుపున ఏజీ వాదించారు. అయితే 56 మంది వీఆర్వోల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. 

కాగా...  జీవో 121 ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సీనియారిటీని కోల్పోతున్నామని నిరసన వ్యక్తం చేస్తూ వీఆర్వోలు ఆందోళన చేస్తున్నారు. తమను ఇతర శాఖలకు కేటాయించడం తగదని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 23 నెలల పాటు పోస్టులు, శాఖలు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్కారు... ఇప్పుడు తమ హక్కులను కాల రాసేలా 121 జీవోను విడుదల చేయడం దారుణమని వీఆర్వో సంఘం నాయకులు మండి పడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీఆర్వోలు... తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే వారు హైకోర్టును ఆశ్రయించారు.