సీసీఎస్ నిధులు 2 వాయిదాల్లో చెల్లించాలి

సీసీఎస్ నిధులు 2 వాయిదాల్లో చెల్లించాలి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల జీతాల నుంచి కట్ చేసిన రూ.200 కోట్ల సీసీఎస్(క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ) నిధులను 2 వాయిదాల్లో చెల్లించాలని సంస్థ మేనేజ్మెంట్ ను హైకోర్టు ఆదేశించింది. సీసీఎస్ కోసం కట్ చేసిన నిధులను ఆర్టీసీ మేనేజ్మెంట్ ఉపయోగించుకుందని, 2 ఏండ్ల నుంచి తిరిగి చెల్లించట్లేదని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఆ పిటిషన్​ను జస్టిస్ శరత్ శుక్రవారం విచారించారు. పిటిషనర్  తరఫున లాయర్ జయప్రకాశ్​ వాదనలు వినిపించారు. నిధులు ఇవ్వకపోవడంతో వేలాది మంది కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోయాయన్నారు. ఆర్టీసీ పరిస్థితి బాగాలేని కారణంగా నిధులు విడుదల ఆలస్యం అయ్యిందని ఆర్టీసీ తరఫున అదనపు ఏజీ  రాంచందర్ రావు కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఆదుకుంటేనే నిధులు ఇచ్చే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. వాదనలు విన్న కోర్టు మొదటి 4 వారాల్లో రూ.100 కోట్లు, తరువాతి 4 వారాల్లో మరో రూ.100 కోట్లు చెల్లించాలని స్పష్టం చేసింది. చెల్లించారా లేదా అనేది 6 వారాల తర్వాత పరిశీలిస్తామంది.