వక్ఫ్​ ల్యాండ్స్​ కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారు?

వక్ఫ్​ ల్యాండ్స్​ కబ్జా చేస్తుంటే  ఏం చేస్తున్నారు?
  • బోర్డు సీఈవోపై హైకోర్టు ఫైర్
  • వచ్చే నెల 17 వరకు సీఈవోపై చర్యలు
    తీసుకోవాలని సర్కారుకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు‘‘నిర్లక్ష్యంగా ఉన్న ఆఫీసర్‌‌‌‌. చట్టాలపై కనీస పరిజ్ఞానం లేదు. ఇలాంటి అధికారిని ఇంటికి పంపేయక కుర్చీలో కూర్చోబెడతారా? వక్ఫ్‌‌‌‌ బోర్డు ఆస్తుల్ని రక్షించాలని అల్లా చెప్పినట్టుగా ఇస్లాంలో ఉంది కదా.. అంతటి మహత్తర బాధ్యతలు నిర్వహించే అదృష్టం వక్ఫ్‌‌‌‌ బోర్డు సీఈవోగా మీకు లభిస్తే నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తరా?” అని వక్ఫ్‌‌‌‌ బోర్డు సీఈవో మహ్మద్‌‌‌‌ ఖాసీంను ఉద్దేశించి హైకోర్టు మండిపడింది. ఇలాంటి అధికారి పదవిలో ఉంటే ప్రయోజనం శూన్యమని, వక్ఫ్‌‌‌‌ బోర్డుకు ల్యాండ్‌‌‌‌ లేకుండా పోయే ప్రమాదం ఉందని కామెంట్​ చేసింది. మహ్మద్‌‌‌‌ ఖాసీంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వచ్చే నెల 17 నాటికి ఆ వివరాలు కోర్టుకు నివేదించాలని మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌ ను ఆదేశించింది. వెంటనే ఖబరిస్థాన్లలో ఆక్రమణలు తొలగించాలని సూచించింది. శ్మశాన వాటికల ఆక్రమణలపై మహ్మద్‌‌‌‌ ఇలియాస్‌‌‌‌, మరికొందరు వేసిన పిల్స్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌  సోమవారం విచారించింది. దీనికి వక్ఫ్‌‌‌‌ బోర్డు సీఈవో మహ్మద్‌‌‌‌ ఖాసీం స్వయంగా హాజరయ్యారు. నాలుగు నెలల కిందే తాను సీఈవో బాధ్యతలు చేపట్టానని చెప్పారు. స్మశానాల ఆక్రమణలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది సివిల్‌‌‌‌ వివాదమంటూ కేసు నమోదు చేయలేదని తెలిపారు.

ఇలాగైతే ఎట్లా?

సీఈవో వివరణపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘‘సీఈవో స్థాయి అధికారిగా ఉన్న మీకు సీఆర్‌‌‌‌పీసీ గురించి తెలియదా? సివిల్‌‌‌‌ వివాదమైతే మేజిస్ట్రేట్‌‌‌‌ దగ్గర కేసు వేయాలనే కనీస న్యాయ పరిజ్ఞానం లేదా? మీ స్థాయి ఆఫీసర్‌‌‌‌ నేరుగా ఎస్పీ సంప్రదించడమో, స్వయంగా కలవడమో ఎందుకు చేయలేదు? కనీసం అడ్వొకేట్‌‌‌‌ను పిలిపించుకుని మాట్లాడాలని తెలియదా? మరి ఆక్రమణదారులతో కుమ్మక్కు అయ్యారా? మీ తీరు ఇలాగే ఉంటే వక్ఫ్‌‌‌‌ బోర్డు ఆస్తులు ఉంటాయని గ్యారెంటీ ఏమిటి? స్మశానాలే కాదు ఇతర భూములు కూడా ఆక్రమణలకు గురవుతాయి కదా?” అని నిలదీసింది. చట్టాల గురించి తెలియని అధికారి ఉండీ లేనట్లేనని కామెంట్​ చేసింది. సీఈవో బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలే అయిందనడం సరికాదని, అదేమీ తక్కువ సమయం కాదని స్పష్టం చేసింది. జీహెచ్‌‌‌‌ఎంసీ లిమిట్స్‌‌‌‌లోని 723 స్మశానాల్లో 86 ఆక్రమణలకు గురైతే.. ఐదే కేసులు రిజిస్టర్‌‌‌‌ అయ్యాయంటే పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందని పేర్కొంది. అయితే ఈ సమయంలో సీఈవో తరఫు లాయర్ కల్పించుకుని.. ఆక్రమణల తొలగింపు అధికారాలు వక్ఫ్‌‌‌‌ బోర్డు సీఈవోకు లేవని, తగినంత స్టాఫ్‌‌‌‌ లేకపోవడం వల్ల తొలగింపు చర్యలకు వీలవడం లేదని చెప్పారు. కానీ ఈ వాదననను హైకోర్టు తోసిపుచ్చింది. మూడు వారాల్లోగా కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని మున్సిపల్‌‌‌‌ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

హాస్టల్ జాగా కబ్జాదారులపై ఏం చర్యలు తీస్కున్నరు?

హాస్టల్ బిల్డింగులకు కేటాయించిన జాగాలో కమర్షియల్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌ కట్టినోళ్లపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదిలాబాద్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ను హైకోర్టు ఆదేశించింది. చట్ట వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తే చ ర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్‌‌‌‌కు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ విజయసేన్‌‌‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. 1975లో హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణాలకు కేటాయించిన జాగాలో ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా మున్నూ రు కాపు సంఘం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌‌‌‌కు చెందిన గొట్టిముక్కల వీఆర్‌‌‌‌ఆర్‌‌‌‌జీ రాజు పిల్‌‌‌‌ దాఖలు చేశారు.

 

పీబీసీ రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తొచ్చాయా: దాసోజుపై హైకోర్టు సీరియస్​

జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయంగా వెనుకబడిన రిజర్వేషన్లు (పీబీసీ) అమలు చేయడంలేదని  పిల్‌‌‌‌ వేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌‌‌‌పై హైకోర్టు సీరియస్​ అయింది. బీసీ రిజర్వేషన్లల్లో పీబీసీ అమలు చేసే వరకూ ఎన్నికలను వాయిదా వేయాలని తీరుబడిగా హైకోర్టును ఆశ్రయించారని పేర్కొంది. ఈ పిల్‌‌‌‌ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని కామెంట్​ చేసింది. ‘‘నిజంగానే రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే పిల్‌‌‌‌ను జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల ముందు దాఖలు చేయరు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పి దాదాపు పదేళ్లు కావస్తుంటే ఇప్పుడు, అదీ జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ వెలువడే ముందు వేస్తారా ?’’ అని ప్రశ్నించింది.  శ్రవణ్​ పిల్​పై సోమవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారణ చేపట్టింది. జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నందున అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు.  దీనిపై స్పందించిన హైకోర్టు.. ఆలస్యంగా పిల్​ వేసినందున స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.   పిల్‌‌‌‌ను మాత్రం విచారిస్తామని తేల్చి చెప్పింది. ఈ దశలో పిటిషనర్‌‌‌‌ న్యాయవాది పవన్‌‌‌‌కుమార్‌‌‌‌ కల్పించుకుని అక్టోబర్‌‌‌‌లో రాష్ట్ర సర్కార్‌‌‌‌కు వినతిపత్రం ఇస్తే ఫలితం లేకే ఇప్పుడు పిల్‌‌‌‌ వేశామన్నారు. 2016లోనూ పిల్స్‌‌‌‌ దాఖలైనట్లు గుర్తు చేశారు. ఎన్నికలు హైకోర్టు తీర్పుకు లోబడి ఉంటాయనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రతిపాదనను బెంచ్​ తోసిపుచ్చింది. తమ తీర్పు వచ్చే ఎన్నికలకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.