
- ఉస్మానియా బిల్డింగ్స్ నిర్మాణంపై లేట్ ఎందుకు
- 6 వారాల్లో క్లారిటీ ఇవ్వాలని సర్కార్‌కు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణంలో ఎందుకు లేట్ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆస్పత్రిలోని హెరిటేజ్ భవనం మినహా మిగిలిన భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఎందుకు శ్రద్ధ చూపడం లేదని అడిగింది. ఇప్పుడున్నవి కూల్చేసి కడతరా లేదా వాటిని అలాగే ఉంచి మిగిలిన ఖాళీ జాగలో కొత్త భవనాన్ని నిర్మిస్తారా అనే అంశంపై ఆరు వారాల్లోగా స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూలిపోయేలా ప్రమాదకరంగా ఉన్నందున దాన్ని కూల్చి తిరిగి నిర్మాణం చేయాలని కోరుతూ దాఖలైన పిల్, చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చరాదని కోరుతూ దాఖలైన పిల్స్‌ను కలిపి బుధవారం ధర్మాసనం మరోసారి విచారించింది. ప్రస్తుత భవనాన్ని కూల్చి నిర్మాణం చేయాలా లేక దానికే మరమ్మతులు చేయాలా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి రాలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఇలా ఎన్నాళ్లు ఆలోచనలు, పరిశీలనలు చేస్తారని, ఈ తరహా కాలయాపన చేయడం కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంది.
ఖాళీ స్థలంలో కొత్త భవనం నిర్మిస్తే వారసత్వ కట్టడాన్ని కాపాడుకోవచ్చునని వ్యాఖ్యానించింది. తిరిగి ఏజీ కల్పించుకుని కరోనా కారణంగా సిబ్బంది పని ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి కల్పించుకుని హెరిటేజ్ బిల్డింగ్‌ను రక్షించాలని, ఖాళీ జాగాలో కొత్త బిల్డింగ్స్ నిర్మించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ వైఖరి తెలియజేసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసిన హైకోర్టు విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.