ముందే కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేసినం

ముందే కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేసినం

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్  
డబ్బు దొరికిందా? అని ప్రశ్నించిన హైకోర్టు 
పోలీసుల దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయన్న ప్రభుత్వం 
నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
విచారణ ఇయ్యాల్టికి వాయిదా

హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులను ట్రాప్ చేసి పట్టుకున్నామని, ప్లాన్ ప్రకారం ఫామ్ హౌస్ లో ముందే అన్ని సెట్ చేశామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నలుగురు టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారని చెప్పింది. దీనికి సంబంధించి ఆడియో రికార్డులు, ఇతర సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయని వెల్లడించింది. ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజీల రిమాండ్ కు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌‌ సీహెచ్‌‌ సుమలత విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఆ ముగ్గురూ వస్తారని మీకు ముందే తెలుసా? కెమెరాలు ముందే ఏర్పాటు చేశారా? ఈ విషయాలన్నీ పోలీసులకు ముందే తెలుసా? ఒక్కసారిగా సమాచారం ఎలా వచ్చింది? నిందితులను సమగ్ర విచారణ చేయకముందే అన్ని విషయాలు ఎలా తెలిశాయి? అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కార్ తరఫున  ఏజీ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ... ‘‘అంతా ప్లాన్ ప్రకారమే చేశాం. నాలుగు రహస్య కెమెరాలను ముందే అమర్చాం. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌‌రెడ్డి తన కుర్తా జేబులో రెండు వాయిస్‌‌ రికార్డర్లు పెట్టుకున్నారు. 26న మధ్యాహ్నం 3:10 గంటలకు రోహిత్‌‌రెడ్డితో ముగ్గురు నిందితులు బేరసారాలు జరిపారు. దీనికి సంబంధించి ఆడియో రికార్డులు ఉన్నాయి. బేరసారాలు జరిపేందుకు నిందితులు వస్తారని రోహిత్‌‌రెడ్డికి ముందే తెలుసు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు” అని సమాధానం ఇచ్చారు. కెమెరాలు కూడా సెట్‌‌ చేశారా? అని హైకోర్టు ప్రశ్నించగా.. అవునని, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని తెలిపారు. మరి డబ్బు దొరికిందా? అని కోర్టు ప్రశ్నించగా... పోలీసుల దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. 

హైదరాబాద్ వదిలి వెళ్లొద్దని ఆర్డర్..  

ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును ఏజీ కోరారు. 41ఏ సీఆర్​పీసీ నోటీసు ఇవ్వలేదని చెప్పి, రిమాండ్‌‌ కు నిరాకరించడం చెల్లదని వాదించారు. అర్నేష్‌‌ కుమార్‌‌ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌కు వ్యతిరేకంగా కింది కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. సత్యేంద్రకుమార్ అంతిల్ వర్సెస్ సీబీఐ కేసులోనూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందని తెలిపారు. నిందితులు దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఉన్నాయని, కింది కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేసి, నిందితులను రిమాండ్‌‌కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిందితుల తరఫు లాయర్ వేదుల శ్రీనివాస్‌‌ వాదిస్తూ.. ఆ ముగ్గురూ ఎక్కడికీ పారిపోరని, హైదరాబాద్‌‌లోనే ఉంటారని చెప్పారు. అసలు డబ్బే దొరకలేదని, రూ.కోట్లలో బేరసారాలు జరిగినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.  ‘‘ఘటన జరిగిన ఫామ్‌హౌస్‌లో డబ్బే దొరకలేదు. ఒక బ్యాగ్‌‌ చూపించి ఏదో ఉందనే భ్రమ కగిలించారు. కావాలని ఈ కేసులో ఇరికించారు. సీఆర్‌‌పీసీలోని 41ఏ నోటీసు ఇవ్వకుండా రిమాండ్‌‌కు పంపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసింది. కింది  కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దు. సమగ్ర వాదనలకు గడువు ఇవ్వాలి” అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. నిందితులు ముగ్గురూ హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది. తమ అడ్రస్ లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు అందజేయాలని తెలిపింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంప్రదింపులు జరపొద్దని.. సాక్షులను ప్రలోభ పెట్టొద్దని చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, విచారణను శనివారానికి వాయిదా వేసింది.

నేడు బీజేపీ పిటిషన్‌‌పై విచారణ

టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహారంపై బీజేపీ వేసిన పిటిషన్‌‌ను హైకోర్టు శనివారం విచారించనుంది. ఎమ్మెల్యేల  కొనుగోలు కేసును సీబీఐ లేదా సిట్‌‌కు అప్పగించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర జనరల్‌‌ సెక్రటరీ జి.ప్రేమేందర్‌‌ రెడ్డి రిట్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. కేసీఆర్‌‌ డైరెక్షన్‌‌లోనే ఇదంతా జరిగిందని..మునుగోడు బైపోల్-లో గెలుపు కోసమే టీఆర్ఎస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని పిటిషన్-లో పేర్కొన్నారు. దీనిపై నేడు హైకోర్టు  వాదనలు విననుంది.