ఎవరికీ అందని మహాకవి.!ఎవరికీ లొంగని అధ్యయనం ఆయనది!

ఎవరికీ అందని మహాకవి.!ఎవరికీ లొంగని అధ్యయనం ఆయనది!

తెలంగాణ నేల తన ఉత్తమో త్తమ పుత్రుని కోల్పోయింది. తల్లి తెలంగాణ విముక్తి కోసం తన  జీవితంలోని సింహభాగాన్ని అంకితం ఇచ్చి రాష్ట్రసాధన కోసం పబ్బతిబట్టిన సాంస్కృతిక సేనాని డాక్టర్ అందెశ్రీ.  సమైక్య పాలనలో   తెలంగాణ జాతిని జాగృతం చేయడానికి ఇంటింటికి సుప్రభాతమై మారుమోగిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని అందించి ప్రజలను  చైతన్యపరిచారు. రాష్ట్ర అవతరణ అనంతరం  దశాబ్దకాలం తర్వాత జాతీయగీతంగా  రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గుర్తింపుకు నోచుకుంది.   తెలంగాణ ఉద్యమానికి కొత్త సాంస్కృతిక రీతులను అందించిన మేటి వ్యూహకర్త అందెశ్రీ. అందెశ్రీ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్నదే తెలంగాణ ధూంధాం.  జై బోలో తెలంగాణ అంటూ గొంతెత్తిన అందెశ్రీకి తెలంగాణ జనం నీరాజనం పట్టింది.  తెలంగాణపై వందల గేయాలను రచించి తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కించడంలో అందెశ్రీ కృషిని తెలంగాణ చరిత్ర ఎన్నడూ మరవదు. 

  కేసీఆర్ ప్రభుత్వం మహాకవి అందెశ్రీని ఎన్ని రకాలుగా అవమానించగలదో అన్ని రకాలుగా అవమానించింది. తెలంగాణ ప్రజల నోళ్లల్లో నడియాడిన జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించడంలో తీవ్రమైన వివక్షను చూపింది. తెలంగాణ ఉద్యమ గీతాన్ని ప్రతి పల్లెకు మోసుకెళ్లిన అందెశ్రీని నాటి చంద్రశేఖరరావు ప్రభుత్వం ఎంతటి అవమానానికి గురి చేసిందో తెలంగాణ సమాజం ఎన్నడూ మరువజాలదు.తెలంగాణ ఉద్యమానికి ఉత్ర్పేరకాలుగా పనిచేసిన ప్రజాయుద్ధం నౌక గద్దర్ అన్నను ఎంతటి అవమానానికి గురి చేసిందో  అంతకు మించి అందెశ్రీని అదేవిధంగా అవమానించింది. ప్రజల పట్ల బేయిమాన్​ నేతల ద్రోహాన్ని చూసి  గాయపడిన కవి హృదయం అందెశ్రీది. 

ఎవరికీ లొంగని అధ్యయనం ఆయనది!

ఇతిహాసాల ప్రభావం  అందెశ్రీపై ప్రగాఢంగా ఉందని తన సన్నిహితుల వద్ద తరుచూ చెబుతూ ఉండేవారు. భారత ఆధ్యాత్మికతలో శ్రీకృష్ణుడి తత్వాన్ని అమితంగా ఇష్టపడే అందెశ్రీ ఆధ్యాత్మికతలో తనదైన సాధనతో సాగేవారు. బౌద్ధంపై ఎంతో అధ్యయనం చేసిన అందెశ్రీ బౌద్ధంపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. ఆధ్యాత్మిక రంగంలో తనకున్న అవగాహనను అధ్యయనాన్ని అర్థం చేసుకోలేని చాలామంది ఆయనను రకరకాల సంస్థలతో సంబంధాలను అంటగట్టారు. అందెశ్రీ ఎవరి విమర్శలకు భయపడని మొండిఘటం. తాను చెప్పాలనుకున్నది మాట్లాడాలనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టుగా ప్రకటించేవారు. అందెశ్రీని వేదికకు అతిథిగా ఆహ్వానించడం అంటే నిర్వాహకులు పెద్ద సాహసాన్ని చేసినట్టే.  చాలా సందర్భాల్లో ముఖస్తుతి లేకుండా తన అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించేవారు . అందెశ్రీని  లెఫ్ట్ ప్రభావంలోకి ఆహ్వానించాలని చాలా ప్రయత్నాలు  జరిగినా, ఎప్పుడు అటువైపుగా తన ప్రయాణాన్ని కొనసాగించలేదు. తను సహజంగా ఆధ్యాత్మికతవైపు ఉండడంతో మతవాద పార్టీలు సంస్థలు తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించినా అందెశ్రీ  శక్తి ముందు వారు నిలవలేకపోయారు. ఇటు లెఫ్ట్, అటు రైట్ ప్రభావాలకు లోనుకాకుండా మధ్యే మార్గంగా ప్రజలే కేంద్రంగా తన రచనలు ఆచరణ ఉండేటట్టు తన గమనంలో ఉంచుకున్న మేటికవి  డాక్టర్ అందెశ్రీ.  అందెశ్రీని అర్థం చేసుకోవడం అంటే ప్రకృతిని అర్థం చేసుకున్నట్టే! 

- దొమ్మాట వెంకటేశ్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్