అర్చకుల వేతనం పెంపు జీవో రిలీజ్

అర్చకుల వేతనం పెంపు జీవో రిలీజ్

హైదరాబాద్, వెలుగు : అర్చకులకు ధూప దీప నైవేద్యం పథకం కింద ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ మంగళవారం జీవో (ఎంఎస్128) విడుదల చేశారు. అర్చకుల గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ఈ ఏడాది మే 1న గోపనపల్లిలో బ్రాహ్మణ సదనం ఓపెనింగ్ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వేతనాల పెంపుపై తాజగా ఉత్తర్వులు విడుదల చేశారు. జీవో రిలీజ్ చేయటం పట్ల సీఎంకు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

ఉమ్మడి పాల‌‌న‌‌లో అర్చకుల‌‌కు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్రమే అందేవని, అర్చకుల ఇబ్బందులను గుర్తించి వేతనాన్ని రూ. 6 వేలకు సీఎం పెంచారని మంత్రి అన్నారు. గ‌‌తంలో 1,805 ఆల‌‌యాల‌‌కు మాత్రమే ఈ స్కీం అమలైందని, ఇప్పుడు దశలవారీగా మరిన్ని ఆలయాలకు స్కీంను వర్తింపచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,541 గుడులకు ఈ స్కీం అమలవుతోందన్నారు.   పథకానికి ఏడాదికి  రూ.78.49 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.