కరెంట్ ఛార్జీలతో సామాన్యులపై మరో పిడుగు

 కరెంట్ ఛార్జీలతో సామాన్యులపై మరో పిడుగు

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరెంట్ బిల్లులు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర సమస్యలు పడుతుంటే పెరిగిన కరెంట్ ఛార్జీలతో సామాన్యుల తలపై మరో పిడుగు పడినట్లయింది. ఈ నెలలో వచ్చిన కరెంట్ బిల్లులు భారీ షాక్ ఇస్తున్నాయి. బిల్లులు చూసి పేద, మధ్య తరగతి కుటుంబాలు గగ్గోలు పెడుతున్నారు. 

ఏప్రిల్ నుంచి పెరిగిన ఛార్జీలను అమలు చేస్తుంది సర్కార్. ఏప్రిల్ లో వాడకానికి సంబంధించి ఈ నెల బిల్లులు రిలీజ్ అయ్యాయి. అయితే వచ్చిన కరెంట్ బిల్లులు ప్రజలను షాక్ కు గురిచేశాయి. మార్చిలో 83 యూనిట్లు వాడితే ఏప్రిల్ లో 183 రూపాయిల కరెంట్ బిల్లు మాత్రమే వచ్చింది. అయితే ఏప్రిల్ లో 89 యూనిట్ల కరెంట్ వాడితే 307రూపాయిల బిల్లు వచ్చింది. కేవలం 6 యూనిట్ల తేడాకే చార్జీలు మూడు రెట్లు పెరిగాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50, 100,200 యూనిట్లలోపు వినియోగించే వారిపైనే అధికభారం పడుతోంది. 200 యూనిట్లు ఆపై విద్యుత్ వినియోగించే ఎగువ మధ్య తరగతి, ధనిక వర్గాల విద్యుత్ బిల్లులు పెరిగినా పెరుగుదల శాతం 10 నుంచి 15 శాతం మాత్రమే కనిపిస్తోంది. అంటే తక్కువ కరెంట్ వాడిన పేద, మధ్య తరగతి కుటుంబాలపైన మాత్రమే అధిక భారం వేసింది సర్కార్.

2022-2023లో 14 శాతం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 5వేల 596 కోట్ల భారం  వేసింది రాష్ట్ర సర్కార్. ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్ కు 10 నుంచి 15 పైసలు, గృహేతర వినియోగానికి  యూనిట్ కు రూపాయి చొప్పున కరెంట్ ఛార్జీలు పెరిగాయి.  అలాగే హెచ్ టీ కేటగిరీలో కూడా అన్ని రకాల వినియోగంపై యూనిట్ కు రూపాయి చొప్పున ఛార్జీలు పెరిగాయి. వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు విద్యుత్ ఛార్జీలు కూడా పెరగడంతో సామాన్యులకు దెబ్బ మీద దెబ్బ పడినట్లయింది. 

మరిన్ని వార్తల కోసం

రివ్యూ పూర్తయ్యే వరకు దేశద్రోహ చట్టాన్ని ఆపేస్తరా?

జూన్ లో వానాకాలం రైతుబంధు