
హైదరాబాద్, వెలుగు: అనుమానంతో భార్యను, అడ్డొచ్చాడని మామను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బాలంపేటలో జరిగింది. బాలంపేటకు చెందిన గఫూర్ సాబ్ బిడ్డ హాజీ బేగానికి హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన సయ్యద్ ఖలీమ్‌తో 15 ఏండ్ల క్రితం పెండ్లయ్యింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఖలీమ్ యాకుత్‌పురాలోని ఓ సైకిల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న ఖలీమ్.. ప్రతిరోజు ఆమెతో గొడవ పడుతుండేవాడు. విసుగు చెందిన హాజీ బేగం పిల్లలను తీసుకొని 8 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఖలీమ్ బాలంపేటకు వెళ్లొస్తుండేవాడు. రెండ్రోజుల క్రితం వచ్చి భార్యను పంపించాలని మామను అడిగాడు. అందుకు గఫూర్‌సాబ్, హాజీ బేగం ఒప్పుకోలేదు. కోపం పెంచుకున్న ఖలీమ్ మంగళవారం ఉదయం 6 గంటలకు నిద్రపోతున్న భార్యను కత్తితో నరికి చంపేశాడు. ఆమె కేకలు విని అడ్డుకునేందుకు వచ్చిన గఫూర్‌పై దాడి చేయగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. వదిలేస్తే ప్రాబ్లమ్ అవుతుందని వెంటపడి మామను కూడా నరికి చంపేశాడు. పోలీసులు స్పాట్ కు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కొడంగల్ సీఐ నాగేశ్వర్రావు తెలిపారు.