తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్షాలు : హైదరాబాద్‌ వాతావరణ శాఖ

తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్షాలు : హైదరాబాద్‌ వాతావరణ శాఖ

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా వడగళ్లతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మెస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలుల ప్రభావం ఉండవచ్చని తెలిపింది. ఈ గాలులు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రకటనలో వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఈ నెల 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఒకవేళ తుపాను ఏర్పడితే దానికి ‘మోచా’ అని పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. యెమెన్‌ దేశంలోని పోర్టు నగరమైన మోచా పేరు పెట్టినట్లు పేర్కొంది. 

అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుపాను దిశ గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండీ వెల్లడించింది. వచ్చేవారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40- నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్‌- మే -జూన్‌ సీజన్‌లో బంగాళాఖాతంలో తరచూ తుఫానులుగా ఏర్పడుతుంటాయి. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.