
న్యూడిల్లీ: అమెరికా విధించిన 25శాతం సుంకం వల్ల భారతదేశం నుంచి అమెరికాకు జరిగే 85 బిలియన్ డాలర్ల ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండబోదని అధికారవర్గాలు తెలిపాయి. వాణిజ్య ఒప్పందంలో భాగంగా వ్యవసాయ, డెయిరీ, జన్యుపరంగా మార్పు చేసిన ఆహార ఉత్పత్తులకు ఎలాంటి టారిఫ్ మినహాయింపులు కేంద్రం ఇవ్వబోదని పేర్కొన్నాయి. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సగం వస్తువులు మినహాయింపు కేటగిరీలో (ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటివి) ఉన్నాయి. టారిఫ్ ప్రభావం మిగిలిన సగంపై మాత్రమే ఉంటుందని సీనియర్అధికారులు అంటున్నారు.
వీళ్లు చెబుతున్నదాని ప్రకారం, భారతదేశం నుంచి అమెరికాకు చేసే ఎగుమతులలో సగ భాగం వరకు ఈ టారిఫ్ వల్ల ప్రభావితం కావు. అమెరికాలోని సెక్షన్ 232 మినహాయింపు కారణంగా, సుమారు 40 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులకు మాత్రమే ఈ టారిఫ్ వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. 2024-–25లో, భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా ఉంది (86.5 బిలియన్ డాలర్లు ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్లు దిగుమతులు). థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ ప్రకారం, 25శాతం టారిఫ్స్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు (ఏపీఐలు), ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధనాలు, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్, కీలక ఖనిజాలు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల వంటి కేటగిరీలకు వర్తించవు.---
అమెరికా డెయిరీ ప్రొడక్టుల విషయంలో మతపరమైన అంశాలు ఉన్నందున, భారతదేశం తన గత వాణిజ్య ఒప్పందాలలో ఏ దేశానికి ఈ రంగంలో టారిఫ్ రాయితీలు ఇవ్వలేదు. జన్యుపరంగా మార్పు చేసిన ఆహార ఉత్పత్తులపై కూడా రాజీ ఉండదు. సుమారు 4 ట్రిలియన్ల జీడీపీ, 140 కోట్ల మంది వినియోగదారులు గల దేశానికి, 40 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పెద్దగా ఉండదని ఒక ఎనలిస్టు తెలిపారు. భారతదేశం కార్మిక ఆధారిత రంగాలైన వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి వాటిపై టారిఫ్ రాయితీలను కోరుతోంది. అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డెయిరీ, యాపిల్స్, ట్రీ నట్స్, జన్యుపరంగా మార్పు చేసిన పంటలపై టారిఫ్ రాయితీలను అడుగుతోంది.
ఒక్కో అమెరికా కుటుంబంపై రూ.2 లక్షల భారం
వెల్లడించిన ఎస్బీఐ రిపోర్ట్
అమెరికా విధించిన 25శాతం సుంకం వల్ల భారతదేశం కన్నా అమెరికాపైనే ఎక్కువ ప్రభావం పడుతుందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. దీని ప్రకారం.. టారిఫ్‌లు అమెరికా జీడీపీని తగ్గించి, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. డాలర్‌ను బలహీనపరుస్తాయి. అమెరికా ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో 2.4శాతం , దీర్ఘకాలంలో 1.2శాతం పెరగవచ్చు. దీనివల్ల ఒక సాధారణ అమెరికన్ కుటుంబంపై ఏటా 2,400 డాలర్ల (దాదాపు రూ.రెండు లక్షలు) భారం పడుతుంది. తక్కువ ఆదాయ కుటుంబాలపై ఈ భారం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. టారిఫ్ ప్రభావం భారతదేశంపై పరిమితంగా ఉంటుంది.
2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధిపై ఇది 25–-30 బేసిస్ పాయింట్ల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, ఫార్మా వంటి కీలక రంగాలు ప్రభావితం అయినప్పటికీ, కేంద్రం తెచ్చిన పీఎల్ఐ వంటి పథకాలు నష్టాన్ని తగ్గిస్తాయి. భారతదేశం అమెరికాకు 40 బిలియన్ డాలర్లు విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. అమెరికా జనరిక్ డ్రగ్ అవసరాలలో 47శాతం వరకు సరఫరా చేస్తుంది. టారిఫ్స్ కొనసాగితే, 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా కంపెనీల ఆదాయాలు 2-8శాతం తగ్గే అవకాశం ఉంది.