మున్ముందు సోలార్‌ ఎవుసం

మున్ముందు సోలార్‌ ఎవుసం
  • భవిష్యత్​లో ఆగ్రో ఫొటో వోల్టాయిస్ సాగు పద్ధతి
  • సౌరపలకల కింద పంటల సాగుపై రీసెర్చ్ ప్రారంభం
  • బెంగూళురు స్టార్టప్‌లతో జయశంకర్ వర్సిటీ ఎంవోయూ  


హైదరాబాద్, వెలుగు:  రానున్నది సోలార్‌ యుగమే. ఇప్పటికే బొగ్గు కొరతతో పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ఇబ్బందికరంగా మారగా.. సోలార్‌ పవర్‌ జనరేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. పొలాల్లోనూ సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి కరెంట్ ఉత్పత్తి చేయడంతో పాటు వాటి కింద పంటలు పండించే ‘‘ఆగ్రో ఫొటో వోల్టాయిక్‌ సాగు’ విధానంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లో రీసెర్చ్​నడుస్తోంది. మన దేశంలో తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోనూ ఈ విధానంపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ కొన్ని స్టార్టప్‌ల ద్వారా ‘‘ఆగ్రో ఫొటో వోల్టాయిక్‌ సాగు’’ విధానంపై అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు బెంగుళూరుకు చెందిన రెండు సంస్థలతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. రాజేంద్రనగర్​లోని అగ్రికల్చర్​యూనివర్సిటీ భూముల్లో ప్రస్తుతం సోలార్​ ప్యానెల్స్​ ఏర్పాటు పనులు నడుస్తున్నాయి. ఈ విధానం సక్సెస్​ అయితే ఆగ్రో ఫారెస్ట్రీ తరహాలో సోలార్‌ ప్యానెల్స్‌ కింద లేదా ప్యానెల్స్​మధ్య పంటలు పండించే కొత్త పద్ధతి రైతులకు అందుబాటులోకి రానుంది. 
పంట పొలాల్లోనూ..
ఇప్పటి వరకు వ్యవసాయేతర, బీడు భూముల్లో మాత్రమే సోలార్​ ప్యానెల్స్​ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఆగ్రో ఫొటో వోల్టాయిక్‌ సాగు విధానం అమలులోకి వస్తే పంట పొలాల్లోనే సోలార్‌ ప్యానెల్స్​ ఏర్పాటు చేస్తారు. కరెంట్​జనరేషన్​తోపాటు వాటి కింద వివిధ పంటల సాగును అందుబాటులోకి తెస్తారు. ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తులో సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేస్తారు. ప్యానెల్స్‌ మధ్యలో, ప్యానల్స్‌ షేడ్‌లో పంటలు సాగు చేయొచ్చు. రైతు తాను వాడుకున్న విద్యుత్తును మినహాయించుకొని మిగిలిన కరెంట్​ను గ్రిడ్‌కు పంపి ఆదాయం పొందవచ్చు. ప్యానెల్స్‌ కింద పంటలు పండించినప్పుడు షేడ్‌ వల్ల వాటర్ లాస్‌ తక్కువగా ఉంటుందని అగ్రికల్చర్​ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. 
పీఎం కుసుమ్​ స్కీంకు అనుసంధానం..
షేడ్‌ నెట్, పాలీహౌజ్‌ల తరహాలో సోలార్​ప్యానెల్స్​ కింద టమాట, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, ఆకుకూరలు, వంగ, పొట్ల, బెండ, దోస వంటి వెజిటబుల్స్‌, ద్రాక్ష వంటి ఫ్రూట్స్‌ కూడా పండించవచ్చని నిపుణులు 
చెబుతున్నారు. చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, ఇజ్రాయల్‌ లాంటి దేశాల్లో సోలార్‌ ప్యానెల్స్​కింద ఇలాంటి పంటలే సాగు చేస్తున్నారు. రైతులు భూములు మాదిరిగానే ప్లాంట్​ను కూడా కౌలుకు ఇచ్చే అవకాశం ఉంటుందని తద్వారా రైతుకు ఆదాయం వస్తుందని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం- కుసుమ్‌’ పథకం కింద రైతులకు సోలార్‌ పంపు సెట్లు అందిస్తోంది. రైతులు 40 శాతం డబ్బులు చెల్లిస్తే, మిగతా 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించే అవకాశం ఉంటుంది. ఇదే పథకం కింద ప్రభుత్వం ఆగ్రో వోల్టాయిక్‌ సాగును ప్రోత్సహించే అవకాశం ఉంది. 


డిజైనింగ్​ పూర్తయింది..
రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో  ఫోటోవోల్టాయిక్​ సాగుపై పరిశోధన నడుస్తోంది. డిజైనింగ్‌ ప్రక్రియ పూర్తయింది, ఎస్టాబ్లిష్ చేస్తున్నం. పొలాల్లో ఏర్పాటు చేసే సోలార్‌ ప్యానెల్స్‌ ట్రాన్స్​పరెన్సీతో పాటు ఎత్తు పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి వీలుగా ఉంటాయి. సూర్యుడు ఎటు వైపు ఉంటే.. ప్యానెల్స్​కూడా అటే తిరుగుతాయి. దీని వల్ల పంటపై నిరంతరాయంగా నీడ ప్రభావం పడదు. సెన్సార్‌ కంట్రోల్‌ మానిటర్‌తో అంతా ఆటోమేషన్‌ చేస్తున్నాం. సన్నకారు రైతుకు ఈ పద్ధతిలో ఎంత లాభం ఉంటుంది, ఎంత పవర్​ ఉత్పత్తి చేస్తే గ్రిడ్‌కు ఇవ్వొచ్చన్నదానిపై అధ్యయనం చేస్తున్నం . ఈ పరిశోధనకు నాబార్డు ఆర్థిక సహకారం అందిస్తోంది.     
                                                                                                                                                                                                                                              ‑ ప్రొఫెసర్​ డా. జగదీశ్వర్‌, డైరెక్టర్​ ఆఫ్​ రీసెర్చ్, జయశంకర్‌ అగ్రివర్సిటీ