- భూసేకరణ విషయంలో కుదరని సయోధ్య
- మూడేళ్లుగా సాగుతున్న పనులు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి టౌన్– కునారం మధ్య ఆర్వోబీ పనులు స్లోగా సాగుతున్నాయి. ఆర్వోబీకి ఇరువైపులా రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరించాల్సి ఉంది. అయితే భూసేకరణ విషయంలో సయోధ్య కుదరడం లేదు. దీనివల్ల స్థానికులు భూమి ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతున్నారు. మూడేళ్ల కింద ప్రారంభమైన ఈ బ్రిడ్జి పూర్తికాకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్వోబీ కోసం ఎదురుచూపులు
2009– 14 మధ్య డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్న టైంలోనే పెద్దపల్లి, కునారం ఆర్వోబీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్పంపారు. ఈక్రమంలో కునారం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న రైల్వే గేట్వద్ద 2022 డిసెంబర్‌లో ఆర్వోబీ నిర్మాణ పనులు రూ. 119 కోట్ల అంచనాతో ప్రారంభించారు. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.199కోట్లకు చేరింది. అయినప్పటికీ పనులు ఇప్పటివరకు50 శాతం కూడా పూర్తి కాలేదు.
ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. మరోవైపు కాజీపేట–-బల్లార్షా రైలు మార్గంలో పెద్దపల్లి కీలక జంక్షన్. దీంతో ఇటీవల రైళ్ల రాకపోకలు భారీగా పెరిగాయి. ఈక్రమంలో రైలు వచ్చిన ప్రతిసారీ గేటు వేస్తుండడంతో వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే టైంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పెద్దపల్లి నుంచి జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు మధ్య ఉన్న దూరభారం తగ్గుతుంది. ఈ రోడ్డుకు అనుసంధానంగా ఫోర్ లేన్ రోడ్డు మంజూరైంది. ఈ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. దీంతోపాటు పెద్దపల్లి మీదుగా కునారం రోడ్డు నుంచి జమ్మికుంట, హుజూరాబాద్, వరంగల్ ఫోర్ లేన్శాంక్షన్ అయింది. ఈ రోడ్లు పూర్తయితే కునారం బ్రిడ్జి కీలకం కానుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి ఆర్వోబీ నిర్మాణంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
