
మాదాపూర్, వెలుగు: మాదాపూర్‌లో ట్యూషన్‌కని వెళ్లిన ఇద్దరు చిన్నారులు మిస్సింగ్అయ్యారు. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ సమీపంలో నివసించే బాలాజీ కొడుకు శ్యామ్సూర్య వెంకటేశ్(14), సాయినగర్‌కు చెందిన శ్రీనివాస్ కొడుకు సాయి స్వాదీప్ (14) గ్రీన్ ఫీల్డ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సమీపంలోని ట్యూషన్‌కు కలిసి వెళ్లేవారు.
ఈ నెల14న శ్యామ్సూర్య వెంకటేశ్(14) స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. 5:00 గంటలకు ట్యూషన్‌కు వెళ్తున్నానని చెప్పి, బ్యాగులో బట్టలు పెట్టుకొని ఇంటి నుంచి వెళ్లాడు. అతని సోదరి కూడా అదే ట్యూషన్‌కు వెళ్తుంది. అయితే, సాయంత్రం శ్యామ్సూర్య ఇంటికి తిరిగి రాకపోవడం, ట్యూషన్‌కు కూడా హాజరు కాకపోవడంతో అతని తండ్రి బాలాజీ ఆందోళనకు గురయ్యాడు.
బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. అదే సమయంలో శ్యామ్ ఫ్రెండ్ సాయి స్వాదీప్ (14) కూడా ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది. వెంటనే బాలాజీ మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్టెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. చిన్నారులు ఇద్దరు కలిసి ట్రైన్లో చెన్నై లేదా ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.