- మళ్లీ రంగంలోకి ప్రస్తుత అధ్యక్షుడు శ్రీహరిరావు
- అభిప్రాయ సేకరణలో ఏఐసీసీ అబ్జర్వర్లు
- మీనాక్షి నటరాజన్ ఫార్ములాతో మారనున్న అంచనాలు
- ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుతో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ పదవి కోసం దరఖాస్తులు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత నాలుగు రోజుల నుంచి ఏఐసీసీ అబ్జర్వర్లు జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో పర్యటిస్తూ, ఓవైపు పార్టీ పటిష్టతపై దిశానిర్దేశం చేస్తూనే.. అధ్యక్షుడి ఎంపిక విషయంలో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా ఈ పదవి గురించి తీవ్ర చర్చ సాగుతోంది.
ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావునే తిరిగి కొనసాగించవచ్చని కొంతమంది పేర్కొంటుండగా.. కొత్తవారికే అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే పాతవారికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేది లేదంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన ప్రకటన శ్రీహరిరావు ఎంపికపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అధిష్టానం ఆదేశం మేరకు కొద్దిరోజుల్లోనే డీసీసీ అధ్యక్ష పదవి ఖరారు కానున్న నేపథ్యంలో సర్కత్రా ఉత్కంఠ నెలకొంది.
శ్రీహరి రావుకు కలిసి వచ్చేనా..
డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రీహరి రావు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేసేందుకు కృషి చేశారు. సీనియర్ నేతలను కలుపుకుంటూ వెళ్తూ పార్టీ కార్యక్రమాలను విజయవం తంగా కొనసాగిస్తున్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి తోనూ శ్రీహరికి సఖ్యత ఉంది. అధిష్టానం మీనాక్షిమీనాక్షి నటరాజన్ ఫార్ము లాను పక్కనపెట్టి శ్రీహరి రావు పేరును బలపరిస్తే వీరిలో ఎవరు కూడా వ్యతిరేకించబోరని అభిప్రాయాలున్నాయి. జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం శ్రీహరి రావుకు మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
లోతుగా ఆరా తీస్తున్న అబ్జర్వర్లు
డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఏఐసీసీ అబ్జర్వర్లు లోతుగా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వారి వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. పార్టీ కోసం ఎంతకాలం పనిచేసిన అంశాన్ని తెలుసుకుంటున్నారు. దరఖాస్తుదారుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు, పార్టీని వారు ఏ విధంగా పటిష్టం చేస్తారోననే అంశంపై కూడా వివరాలు సేకరించినట్లు సమాచారం.
తెరపైకి పలువురు సీనియర్లు
కాంగ్రెస్ ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం సరికొత్త విధానంతో ముందుకు సాగుతుండడంతో చాలామంది ఆశావహులు తెరపైకి వచ్చారు. ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ముథోల్ నియోజకవర్గం సీనియర్ నేత, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, కడెం మండలానికి చెందిన సీనియర్ నాయకుడు పొద్దుటూరి సతీశ్ రెడ్డి, పెంబి మండలానికి చెందిన సల్ల దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ జి మండలం నుంచి సమతా సుదర్శన్, సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అడ్వకేట్ కురువ నవీన్ రెడ్డి, ఖానాపూర్ నుంచి మండల అధ్యక్షుడు దొనికేని దయానంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తులు చేసుకున్నారు. అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు వీరంతా ఎవరికి వారే తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
