కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ..మెకానిక్ మృతి..

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ..మెకానిక్ మృతి..

శామీర్ పేట, వెలుగు: కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని డిపో మెకానిక్ చనిపోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. సింగాయిపల్లికి చెందిన వెంకటేశ్(43) హకీంపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్​గా పనిచేస్తున్నాడు.  శుక్రవారం భార్య, ముగ్గురు పిల్లలు, బంధువులైన మరో ముగ్గురు మహిళలతో కలిసి కారులో మేడ్చల్ పరిధి మునీరాబాద్ సమీపంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లాడు.  సాయంత్రం తిరిగి ఇంటికి బయలుదేరాడు. హకీంపేట డిపో వద్దకు రాగానే ప్రజ్ఞాపూర్ నుంచి సికింద్రాబాద్​కు వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేశ్ అక్కడిక్కడే మృతి చెందగా.. అతడి భార్యాపిల్లలు, ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థాని
కులు వీరిని అల్వాల్​లోని ఓ హాస్పిటల్​కు తరలించారు. తాను పనిచేసే డిపో దగ్గరే  ప్రమాదం జరిగి వెంకటేశ్ ప్రాణాలు కోల్పోవడం తోటి కార్మికుల్లో విషాదాన్ని నింపింది. 

 కారు ఢీకొని గాయపడ్డ కానిస్టేబుల్.. 

కారు ఢీకొని కానిస్టేబుల్ గాయపడ్డ ఘటన శామీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. వికారాబాద్​కు చెందిన షరీఫ్(26) శామీర్ పేట పీఎస్​లో  కానిస్టేబుల్​గా పనిచేస్తూ అదే ఏరియాలో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం షరీఫ్ కూతురు తొట్టెల ఫంక్షన్ ఉంది. దీంతో గురువారం అర్ధరాత్రి వరకు డ్యూటీ చేసి ఇంటికి బయలుదేరాడు. అదే టైమ్​లో అచ్చాయిపల్లి క్రాస్ రోడ్ దగ్గర రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో విషయం తెలుసుకున్న షరీఫ్​ అక్కడికి వెళ్లాడు. ఘటనాస్థలంలో ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేస్తుండగా.. ఓ కారు వచ్చి అతడిని ఢీకొట్టి వెళ్లింది. ప్రమాదంలో షరీఫ్ తలకు బలమైన గాయం కాగా.. మొబైల్ వెహికల్ డ్రైవర్, హోంగార్డు గోపియా స్వల్పంగా గాయపడ్డాడు. షరీఫ్​ను సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్​​కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట పోలీసులు తెలిపారు.