స్కూల్​లో పాము కాటుతో చిన్నారి మృతి

స్కూల్​లో పాము కాటుతో చిన్నారి మృతి

పర్వతగిరి (వరంగల్), వెలుగు: చెవులు కుట్టే ప్రోగ్రాం ఉండటంతో ఇళ్లంతా చుట్టాలతో నిండిపోయింది. ఎంతో ఉత్సాహంగా స్కూల్​కు వెళ్లిన ఆ చిన్నారి ఫ్రెండ్స్​కు చెప్పుకుని మురిసిపోయింది. బాత్​రూం వెళ్లడానికి క్లాస్ నుంచి బయటికి వచ్చింది. అప్పుడే పాము కాటేయడంతో హాస్పిటల్​కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఈ ఘటన వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారులోని భట్టుతండాలో బుధవారం జరిగింది. భట్టు మోహన్, పార్వతిలకు ఇద్దరు బిడ్డలు. పెద్ద కూతురు భట్టు మన్విత (6) తండాలోని ప్రైమరీ స్కూల్​లో చదువుతున్నది. బుధవారం ఉదయం స్కూల్​కు వెళ్లింది. గురువారం చెవులు కుట్టే ప్రోగ్రాం ఉందని ఫ్రెండ్స్​కు చెప్పుకొని మురిసిపోయింది. బాత్​రూం వస్తుందని టీచర్​కు చెప్పడంతో వెళ్లమన్నాడు. క్లాస్ రూం నుంచి బయటికొచ్చిన మన్విత.. మెట్లు దిగుతుండగా తాచుపాము కాటేసింది. ఈ విషయాన్ని టీచర్‌‌కు చెప్పడంతో అతను పేరెంట్స్​కు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి మన్వితను నర్సంపేట హాస్పిటల్​కు తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయింది. చెవులు కుట్టే ప్రోగ్రాం ఉండటంతో ఇంటికొచ్చిన బంధువులు మన్విత చనిపోయిందని తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.