ప్రధాన నిందితుడికి తెలవకుండా తమ ఫోన్లకు వీడియోలు పంపుకున్న మిగతా నిందితులు

ప్రధాన నిందితుడికి తెలవకుండా తమ ఫోన్లకు వీడియోలు పంపుకున్న మిగతా నిందితులు
  • మహిళల బ్లాక్ మెయిల్ కేసులో ముగ్గురి అరెస్ట్​

  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన గద్వాల ఎస్ఐ బదిలీ

  • నిందితులందరూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు

గద్వాల, వెలుగు:  గద్వాల టౌన్ లో అమ్మాయిలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. న్యూడ్ కాల్స్ కేసులో సోమవారం మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. న్యూడ్ కాల్స్ కు సంబంధించిన ఫొటోలను నిందితులు సోషల్ మీడియాలో పెట్టి మహిళలను బ్లాక్ మెయిల్  చేసిన ఘటనను సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేశామని ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితం కీలక నిందితుడైన తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశామని, సోమవారం మరో ఇద్దరు నిందితులు కాశపోగు నిఖిల్, ధీర వినోద్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించామని చెప్పారు.

‘‘నిందితులు మహేశ్వర్ రెడ్డి, ధీర వినోద్, నిఖిల్, క్రాంతి  నలుగురు ఫ్రెండ్స్. మహేశ్వర్ రెడ్డికి ఫుల్లుగా లిక్కర్ తాగించి అతడి ఫోన్ లో ఉన్న న్యూడ్ కాల్స్  ఫొటోలు, వీడియోలను అతనికి తెలిబయకుండానే అఖిల్ తీసుకొని వినోద్ కు షేర్ చేసిండు. వినోద్ వాటిని క్రాంతికి, తన ఫ్రెండ్స్​కి షేర్ చేయడంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. న్యూడ్ కాల్స్  వ్యవహారం బయటకు రాగానే డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్ తో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసినం. ఎంక్వైరీ ఇంకా కొనసాగుతోంది. బాధితులు ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు.వారి వివరాలను సీక్రెట్ గా ఉంచుతాం”అని ఎస్పీ వివరించారు. యువతుల ఫోటోలు, వీడియోలు ఇకపై ఎవరైనా షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్​నేత 

హనీట్రాప్ కేసులో ఏ3 గా ఉన్న ధీర వినోద్​కుమార్​ గద్వాల టీఆర్ఎస్​ప్రధాన కార్యదర్శి కాగా, అతనితో పాటు మిగిలిన ముగ్గురూ (మహేశ్వర్ రెడ్డి, నిఖిల్, క్రాంతి) పట్టణంలోని ఓ కీలక నేతకు అనుచరులుగా ఉన్నారు. అందువల్లే  కేసు దర్యాప్తులో  పోలీసులు మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఆపై గద్వాల ఎస్సై హరిప్రసాద్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఆయనను నాగర్ కర్నూల్ జిల్లా  స్పెషల్ బ్రాంచ్ కి ట్రాన్స్ ఫర్​ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

దోషులను శిక్షించాలి: బీజేపీ మహిళా మోర్చా

యువతుల న్యూడ్​ ఫొటోలు, వీడియోలను వైరల్​ చేసిన టీఆర్ఎస్​ యూత్ ​లీడర్లకు కఠినంగా శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పద్మావతి, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, కౌన్సిలర్లు అనిత రజక జయశ్రీ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్​ చేశారు.