బస్సు నడుపుతుండగా డ్రైవర్కు హార్ట్ ఎటాక్..

బస్సు నడుపుతుండగా డ్రైవర్కు హార్ట్ ఎటాక్..

 గుజరాత్‌ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు కారు ఢీకొట్టుకున్నాయి.  ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. దాదాపు 32 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిలో 17 మందిని వల్సాద్‌లోని ఆసుపత్రికి..మరో  14 మందిని నవ్‌సారిలోని ఆసుపత్రికి.. మరొక క్షతగాత్రుడిని చికిత్స కోసం సూరత్‌ ఆసుపత్రికి తరలించినట్లు అదనపు జిల్లా కలెక్టర్ కేతన్ జోషి తెలిపారు.

ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగడంతో బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిందని.. అతడు కూడా అక్కడికక్కడే చనిపోయాడని చెప్పారు. బస్సులో ఉన్నవారంతా సూరత్‌లో జరిగిన ప్రముఖ్‌ స్వామి మహరాజ్‌ మహోత్సవ్‌కు హాజరై తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  9మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు.  మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షలు,  గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియాను ప్రధాని  ప్రకటించారు.