V6 News

పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్.. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు

పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్.. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు
  • ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
  • 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటుహక్కు వినియోగం
  • యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికిపైగా పోలింగ్
  • భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79 శాతం
  • 20 జిల్లాల్లో 80%, ఏడు జిల్లాల్లో 70 శాతానికి పైగా నమోదు

హైదరాబాద్, వెలుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ​కేంద్రాల వద్ద బారులు తీరారు. 18 ఏండ్ల యువత నుంచి 90 ఏండ్లు దాటిన పండు ముదుసలి వరకు అందరూ ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3,834  గ్రామాల్లో  53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు వేయగా.. 84.28% పోలింగ్​ నమోదైంది. 

అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్​ రికార్డు అయింది. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79 శాతం నమోదైంది. అన్నిచోట్లా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ముగిసింది. ఒంటి గంటలోపు క్యూలైన్​లో ఉన్నవారికి ఓటేసేందుకు ఎన్నికల ఆఫీసర్లు అనుమతి ఇచ్చారు. పోలింగ్​ ముగిసిన తర్వాత గంట లంచ్ ​బ్రేక్ ​తీసుకొని.. ఆ వెంటనే కౌంటింగ్​ ప్రారంభించి, విజేతలను ప్రకటించారు.

ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. 53,57,277 మంది ఓటర్లకుగాను 45,15,141  మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఇందులో 26,13,180 మంది పురుష ఓటర్లకు గాను, 21,99,269 మంది.. 27,43,908 మంది మహిళా ఓటర్లకు గాను, 23,15,796 మంది.. ఇతర ఓట్లు 189కి గాను, 78 మంది ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా 84.28 శాతం  పోలింగ్​ నమోదు కాగా.. ఇందులో  మహిళా ఓటర్లు 84.40 శాతం, పురుష ఓటర్లు 84.16 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కన పంచాయతీ  ఓటింగ్​లోనూ మహిళా ఓటర్లే పైచేయి సాధించారు.

4 జిల్లాల్లో 90 శాతం
నాలుగు జిల్లాల్లో 90 శాతం, 20 జిల్లాలో 80 శాతం, ఏడు జిల్లాల్లో 70 శాతం పోలింగ్​ దాటింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం పోలింగ్​ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓట్లు 1,55,552 ఉండగా.. 1,44,483 ఓట్లు పోలయ్యాయి. నల్గొండ జిల్లాలో మొత్తం ఓట్లు 4,51,007 ఉండగా..  4,08,316 ఓట్లు (90.53%) నమోదయ్యాయి. 

సూర్యాపేట జిల్లాలో మొత్తం ఓట్లు 2,27,960 ఉండగా..  2,05,583 ఓట్లు (90.18%), ఖమ్మం జిల్లాలో 2,40,528 ఓట్లు ఉండగా.. 2,16,854 ఓట్లు (90.16%) నమోదయ్యాయి. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం పోలింగ్​ జరిగింది. ఇక్కడ మొత్తం 2,59,070 ఓటర్లు ఉండగా.. 1,85,974 మంది ఓటింగ్​లో పాల్గొన్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక మహిళా ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 92.33 శాతం మంది మహిళలు ఓటు వేశారు. ఆ తర్వాత ఖమ్మంలో 90.12 శాతం, నల్గొండలో 90.02 శాతం మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యల్పంగా మహిళల ఓటింగ్​ శాతం భద్రాద్రి కొత్తగూడెంలో 71.66%, ఆదిలాబాద్  జిల్లాలో 74.21% నమోదైంది. 

ఇక అత్యధిక పురుష ఓటింగ్ శాతం యాదాద్రి భువనగిరి జిల్లాలో 93.45 శాతం, ఆ తర్వాత నల్గొండ  జిల్లాలో 91.07 శాతం నమోదైంది. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 73.01 శాతం మాత్రమే పురుషులు ఓటు వేశారు. ఇక్కడ మహిళల ఓటింగ్ 81.80 శాతం కంటే పురుషుల ఓటింగ్ సుమారు 8 శాతం తక్కువ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌‌లో కూడా పురుషుల ఓటింగ్ శాతం తక్కువగానే నమోదైంది. 

మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూర్లకు తరలివచ్చారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు భారీ ఎత్తున తరలిరావటంతో.. చౌటుప్పల్ దగ్గర హైవేపై భారీగా వాహనాలు కనిపించాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లోనూ రద్దీ కనిపించింది.

మధ్యాహ్నం 2  నుంచి మొదలైన కౌంటింగ్
ఎన్నికల ఆఫీసర్లు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలుత పోస్ట ల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలిస్తే ఈ సారి పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. 

ఓట్ల లెక్కింపు సమయంలోఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చూశారు. వార్డుల వారీగా రౌండ్ టు రౌండ్ ఓట్ల ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై.. ఉప సర్పంచ్‌‌లను ఎన్నుకున్నారు.

 కాగా, కొన్ని చోట్ల చెదురుముదురు  ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు భారీ బందోబస్త్​ నిర్వహించారు. 

మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ రాణి కుముదిని, సెక్రటరీ మంద మకరందు, పంచాయతీ ఎన్నికల అథారిటీ సృజన ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు. 3,461 పోలింగ్​ కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్​ నిర్వహించగా.. పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేసి జిల్లా ఎలక్షన్​ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.

ఆ జిల్లాల్లో తగ్గిన వలస ఓటర్లు
ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగాల రీత్యా తెలంగాణ పల్లెల నుంచి అనేకమంది పట్టణాలు, నగరాలకు వలసవెళ్లారు. హైదరాబాద్, ముంబై, సూరత్, గల్ఫ్​తోపాటు తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి రాలేక కొందరు.. ఆఫీసులు, కాలేజీలకు సెలవులులేక ఇంకొందరు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. 

అందువల్లే పోలింగ్​ శాతం 85లోపు ఆగిపోయిందని, లేదంటే 90శాతం దాటేదని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా జగిత్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి వంటి జిల్లాల్లో పోలింగ్ శాతం తగ్గడానికి వలస ఓటర్ల ప్రభావం పడింది.

ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చాలామంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు, హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు వెళ్లినవారు పంచాయతీ ఎన్నికల కోసం తిరిగి రాకపోవడం ఓటింగ్ శాతంపై ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నది. మరోవైపు చలి తీవ్రత కూడా అధికంగా ఉండటంతో వివిధ ప్రాంతాల్లోని వారు తెల్లవారుజామున ప్రయాణం చేయడం ఇబ్బందిగా భావించి ఓటువేయడానికి వెళ్లలేదని పలువురు పల్లె ఓటర్లు పేర్కొన్నారు.