ఇయాల్టి నుంచి పతంగుల పండుగ..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో ఏర్పాట్లు పూర్తి

ఇయాల్టి నుంచి పతంగుల పండుగ..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో సంక్రాంతి సందడికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు (మంగళవారం నుంచి గురువారం వరకు) ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్('సెలబ్రేట్ ది స్కై') జరగనుంది. రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పతంగులు ఎగరనున్నాయి. 

ఇందులో 18 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ స్థాయి కైట్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథులుగా ఫెస్టివల్‌‌‌‌ను ప్రారంభిస్తారు. 

ప్రజలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ (సీఎల్ఐసీ) సహకారంతో స్వీట్ ఫెస్టివల్‌‌‌‌ కూడా నిర్వహించనున్నారు. ఇందులో60 స్టాల్స్‌‌‌‌లో 1,200 రకాల మిఠాయిలు, తెలంగాణ సంప్రదాయ పిండివంటలు ప్రదర్శిస్తారు. చేనేత, హస్తకళలకు 100 స్టాల్స్ ఏర్పాటుచేశారు. వీటికి అదనంగా ఈ నెల16 నుంచి 18వ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.