పొత్తులపై లెఫ్ట్​లో గందరగోళం.. సీట్లపై క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్​ 

పొత్తులపై లెఫ్ట్​లో గందరగోళం.. సీట్లపై క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్​ 
  •  కర్నాటక ఫలితాల తర్వాత మారిన సీపీఐ స్వరం 
  •  బీఆర్ఎస్​ వైపే సీపీఎం చూపు.. ఊగిసలాటలో సీపీఐ 

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ తో పొత్తుల అం శం లెఫ్ట్  పార్టీలను అయోమయానికి గురిచేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల టైమ్  దగ్గరపడుతున్నా ఎన్నికల్లో బీఆర్ఎస్​తో కలిసి పనిచేసే అంశంపై ఆ పార్టీల్లో స్పష్టత రావట్లేదు. మునుగోడు ఎన్నికల నుంచి నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్​తోనే ఉంటామని చెప్పిన వామపక్షాల స్వరం మారుతున్నది. పొత్తులపై కేసీఆర్​ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పాటు కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్  గెలుపొందడం దీనికి కారణంగా తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం సీపీఎం, సీపీఐ పార్టీలు కీలకంగా పనిచేశాయి. ఆ పార్టీల అండతోనే బీఆర్ఎస్​ ఆ బైపోల్ లో  గట్టెక్కిం ది. రానున్న ఎన్నికల్లోనూ సీపీఎం, సీపీఐతో కలిసి పనిచేస్తామని అప్పట్లో  కేసీఆర్ ప్రకటించారు. అదే టైంలో సీపీఎం, సీపీఐ కూడా తాము పోటీ చేసే స్థానాలపై ఎలాంటి వివాదం ఉండరాదని చెప్పారు. చివరికి ఒకపార్టీ అడిగిన స్థానాన్ని మరో పార్టీ అడగొద్దని నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానంగా సీపీఎం పార్టీ పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడ, మధిర స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా.. కొత్తగూడెం, హుస్నాబాద్, వైరాతో పాటు మరోస్థానంలో సీపీఐ పోటీకి సిద్ధమైంది. అయితే, సీపీఎం, సీపీఐ స్టేట్ సెక్రటరీలు పోటీచేయాలని భావిస్తున్న పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్​ నేతల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ క్రమంలో పొత్తుపై ఇప్పుడే కాకుండా, నాన్చే ధోరణిలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. 

సీపీఐ పునరాలోచన

కేసీఆర్  కొంతకాలంగా సీపీఎం, సీపీఐ నేతలకు అపాయింట్​మెంట్ ఇవ్వడం లేదు. దీనిపై ఆయా పార్టీల నేతలు సీఎంపై గుర్రుగా ఉన్నారు. మరోపక్క ఆయా పార్టీలు జిల్లాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నాయి. పొత్తులపై పునరాలో చిస్తున్నామని సీపీఐ నేతలు ప్రకటించారు. కొత్త గూడెం సీటుపై తేలితేనే బీఆర్ఎస్​తో పొత్తు అం టూ ఆ పార్టీ లీడర్లు స్పష్టం చేశారు. అయితే, నిన్నటి వరకూ బీఆర్ఎస్ పై పెద్దగా విమర్శలు చేయని ఆ పార్టీ.. తన తీరును మార్చుకున్నట్లు స్పష్టమవుతోం ది. ఇదే టైంలో సీపీఎం మాత్రం బీఆర్ఎస్​తోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. బీజేపీపై బీఆర్ఎస్  వైఖరి మారనంత వరకూ ఇదే విధానం కొనసాగించాలని యోచిస్తోంది. సీట్ల విషయంలో పట్టుపట్టాలని నిర్ణయించింది.