కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసుడు వదిలేసుడు

కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసుడు వదిలేసుడు

వరుసగా మూడో ఏడాదీ అక్కరకురాని ప్రాజెక్టు
2019లో 18.50 టీఎంసీలు.. 2020లో 18 టీఎంసీలు వృథా
ఈసారి 35 టీఎంసీలు కూడా సముద్రంలోకే
వరద పెరగడంతో ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ దాకా గేట్లన్నీ ఖుల్లా

హైదరాబాద్‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వరుసగా మూడో ఏడాది  కూడా కిందికే పోతున్నాయి. కరెంట్‌ బిల్లులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎత్తిపోసిన నీళ్లన్నీ బంగాళాఖాతంలో చేరుతున్నాయి. ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించిన 2019 నుంచి మొదలు పెడితే ఈ వానాకాలం వరకు కింది నుంచి నీళ్లు ఎత్తిపోసుడు.. ఎగువ నుంచి వరద రాగానే  ఆ నీళ్లను మళ్లీ నదిలోకి వదిలి పెట్టుడు పరిపాటిగా మారింది. ప్రభుత్వం తొందరపాటుతో గత 
రెండేండ్లలో 36.50 టీఎంసీలు వృథా అయ్యాయి. ఈసారి ఎత్తిపోసిన 35 టీఎంసీల నీళ్లు కూడా సముద్రం పాలయ్యే అవకాశముంది. 
మొదటి ఏడాది ఇదీ పరిస్థితి
కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్‌ 21న అధికారికంగా ప్రారంభించగా, అదే ఏడాది జులై 6న కన్నెపల్లి పంపుహౌస్‌లో ఒక పంపును నడిపి ఎత్తిపోతలు ప్రారంభించారు. అన్నారం బ్యారేజీలోకి ఆరు టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోశారు. జులై 31న మేడిగడ్డ (కన్నెపల్లి) నుంచి ఎత్తిపోతలు బంద్‌ చేశారు. ఆగస్టు 5న ఎల్లంపల్లికి ఎగువ నుంచి భారీ వరద వచ్చింది. అదే రోజు సుందిళ్ల పంపుహౌస్‌లో ఒక మోటారును కొద్దిసేపు నడిపించి ఆఫ్‌ చేశారు. 
హడావుడిగా లిఫ్ట్​ చేసి..!
ఈ ఏడాది జులై రెండో వారంలో గోదావరి బేసిన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేశారు. అయినా ప్రభుత్వం హడావుడిగా జూన్‌ 16న ఎత్తిపోతలు షురూ చేయించి జులై 7 వరకు మోటార్లు నడిపించింది. ఈ టైంలో మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీకి 35 టీఎంసీలు  ఎత్తిపోశారు. అక్కడి నుంచి సుందిళ్లకు 30.72, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి 32, ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు 23.45 టీఎంసీలు ఎత్తిపోశారు. మిడ్‌ మానేరు గేట్లు ఎత్తి ఎల్‌ఎండీకి  12.71 టీఎంసీలు తరలించారు. ప్రస్తుతం వరద వస్తుండటంతో ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ దాకా గేట్లన్నీ ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.


అప్పటికే వరద పెరగడంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. దీంతో మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోసిన ఆరు టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఎల్లంపల్లికి ఎగువ నుంచి వచ్చిన వరద నీటిలో 12.50 టీఎంసీలు లింక్‌‌ -2 ద్వారా మిడ్‌‌ మానేరుకు ఎత్తిపోశారు. ఈ రిజర్వాయర్‌‌లో పూర్తి స్థాయిలో నీళ్లు నిలిపేందుకు ప్రయత్నించడంతో కట్టకు బుంగపడి రాత్రికి రాత్రే గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఆ నీళ్లన్నీ ఎల్‌‌ఎండీలోకి చేరాయి. లోయర్‌‌ మానేరు డ్యాంకు ఎగువ నుంచి వరద రావడంతో గేట్లు ఎత్తి ఆ నీటిని మానేరు నదిలోకి వదిలేయాల్సి వచ్చింది. ఇలా మొదటి ఏడాది ఎత్తిపోసిన నీళ్లల్లో 18.50 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి.
ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ దాకా గేట్లన్నీ ఓపెన్‌‌
ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూడు రోజుల కిందట గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో కురిసిన వర్షాలతో ఎల్లంపల్లికి పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో ఇంజనీర్లు బుధవారం ప్రాజెక్టు 14  గేట్లు ఎత్తి  86,476  క్యూసెక్కుల  నీటిని నదిలోకి వదిలారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో సుందిళ్ల బ్యారేజీ 10 గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కులు నదిలోకి వదిలేస్తున్నారు. ఈ బ్యారేజీలో 8.83 టీఎంసీలకు 6.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అన్నారం బ్యారేజీ ఐదు గేట్లు 4,500 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. ఈ బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు 8.54 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి 96 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌‌ఫ్లో ఉండటంతో 24 గేట్లు ఎత్తి 92 వేల క్యూసెక్కులకు పైగా నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ బ్యారేజీలో 16.17 టీఎంసీలకు 13.38 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్సారెస్పీలోకి పెద్ద ఎత్తున వరద వస్తోంది. వర్షాలు ఇలాగే కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లోనే పోచంపాడు గేట్లెత్తే అవకాశముంది. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా పోచంపాడులోకి వచ్చే వరద నీళ్లను మిడ్‌‌ మానేరు, లోయర్‌‌ మానేరులోకి తీసుకునే అవకాశముండేది. ప్రభుత్వం ముందే కింది నుంచి నీళ్లు ఎత్తిపోసి ఆ రెండు రిజర్వాయర్లను   నింపడటంతో పైనుంచి వచ్చే 
వరద మొత్తం సముద్రం పాలు కానుంది. ఈసారి ఎత్తిపోసిన 35 టీఎంసీలు కూడా సముద్రం పాలుకానున్నాయి. 
మేడిగడ్డ నుంచి 130 టీఎంసీలు లిఫ్టింగ్‌‌
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి ఈ ఏడాది వరకు మేడిగడ్డ నుంచి 130 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు. 2019 -–20 ఫ్లడ్‌‌ సీజన్‌‌లో 60 టీఎంసీలు, 2020 –-21లో 35 టీఎంసీలు, 2021– -22 వాటర్‌‌ ఇయర్‌‌లో జులై ఏడో తేదీ నాటికి 35 టీఎంసీలు ఎత్తిపోశారు. అన్నారం బ్యారేజీ నుంచి 139 టీఎంసీలు లిఫ్ట్‌‌ చేశారు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి 133 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌‌ చేశారు. లింక్​ 2లోని నందిమేడారం, లక్ష్మీపూర్​ పంపుహౌస్​ల ద్వారా 128 టీఎంసీలు మిడ్​మానేరుకు ఎత్తిపోశారు. 
రెండో ఏడాది 18 టీఎంసీలు వృథా
2020 –- 21 వాటర్‌‌ ఇయర్‌‌లో మేడిగడ్డ నుంచి 35 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు. ఇందులో ఫ్లడ్‌‌ సీజన్‌‌ ఆరంభంలో ఎత్తిపోసిన 18 టీఎంసీలకు పైగా నీళ్లను తర్వాత భారీ వర్షాలు కురవడంతో కిందికి వదిలారు. మొదటి ఏడాది నీటిని కిందికి వదిలేసినా దాని నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. నిరుడు వర్షాలు బాగా పడటంతో కాళేశ్వరం ఎత్తిపోతలతో పనిలేకుండా పోయింది. యాసంగి సీజన్‌‌ కోసం 2021 జనవరి మూడో వారంలో మళ్లీ ఎత్తిపోతలు ప్రారంభించారు. ఇలా తరలించిన నీటిని ఎస్సారెస్పీ స్టేజీ -2 ఆయకట్టుకు ఇచ్చారు.
డెసిషన్‌‌ సపోర్ట్‌‌ సిస్టం ఉత్తదేనా?
కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్‌‌లను ఆపరేట్‌‌ చేయడానికి ప్రభుత్వం కాళేశ్వరం డెసిషన్‌‌ సపోర్ట్‌‌ సిస్టం పేరుతో ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ వ్యవస్థ తయారు చేయించింది. ప్రాణహితతో పాటు గోదావరి నదిపై ఏర్పాటు చేసిన గేజ్‌‌ స్టేషన్ల ద్వారా వచ్చే ఇన్‌‌ ఫ్లో అలర్ట్స్‌‌ ఆధారంగా కింద నుంచి నీళ్లు ఎత్తిపోయాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్లడ్‌‌ సీజన్‌‌కు ఆ సిస్టం అందుబాటులోకి వచ్చినా దానిని వినియోగించలేదు. ప్రభుత్వం కింది నుంచి నీటిని ఎత్తిపోయాలని ఆదేశాలు ఇవ్వడంతో మోటార్లు ఆన్‌‌ చేసి లిఫ్టింగ్‌‌ మొదలు పెట్టారు. ఇలా ఎత్తిపోసిన నీళ్లన్నీ ఇప్పుడు మళ్లీ సముద్రంలోకే పరుగులు పెట్టనున్నాయి.