చావనైనా చస్తాం.. భూమి ఇవ్వం

చావనైనా చస్తాం.. భూమి ఇవ్వం

కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2  కెనాల్ సర్వేను అడ్డుకున్న రైతులు 

బోయినిపల్లి, వెలుగు: చావనైనా చస్తాం కానీ వరద కాలువకు భూమి ఇవ్వబోమంటూ రైతులు ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేర్ కు మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు ప్రస్తుత వరద కాలువకు సమాంతరంగా మరో కెనాల్ ను నిర్మించడానికి ప్రభుత్వం భూ సర్వే ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్​లో భూ సర్వేకు వెళ్లిన రెవెన్యూ ఆఫీసర్లను రైతులు అడ్డుకున్నారు. ఇప్పటికే మొదటి వరద కాలువ కింద భూములు కోల్పోయామని, చావనైనా చస్తాం కానీ మరోసారి భూమి ఇవ్వబోమంటూ తేల్చిచెప్పారు. దీంతో అధికారులు స్థానిక తహసీల్దార్ కు సమాచారం అందించారు. తహసీల్దార్ యుగంధర్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. 

మొదటి కాలువ కింద భూములు కోల్పోయిన రైతులు మళ్లీ భూమి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేకుంటే ఎకరాకు రూ. 40 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.  ఏదో  ఒకటి చెప్పేవరకు తమ భూములను సర్వే చేయడానికి వీల్లేదని అన్నారు. ఎంత చెప్పినా రైతులు వినకపోవడంతో రెవెన్యూ అధికారులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై అభిలాష్ అక్కడికి వచ్చి అధికారులకు సహకరించాలని రైతులకు సూచించారు. 15 రోజుల్లోగా తమ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఎప్పుడు సర్వేకు వచ్చినా అడ్డుకుంటామని చెబుతూ రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.