
- ఎఫ్ఎస్ఎల్ వెబ్ సైట్ ను లాంచింగ్ చేసిన డీజీపీ రవిగుప్తా
- వర్చువల్‌గా 8 భరోసా సెంటర్లు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు : నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ కీలకమైందని డీజీపీ రవిగుప్తా అన్నారు. బాధితులకు న్యాయం చేసే విధంగా కేసులను నిరూపించడంలో దర్యాప్తు సంస్థలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)ను బలోపేతం చేస్తామని తెలిపారు. అడిషనల్ డీజీ, ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖాగోయల్‌తో కలిసి తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్‌లాబొరేటరీ వెబ్‌సైట్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 8 భరోసా సెంటర్లను మంగళవారం వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఐజీ తరుణ్‌జోషి, డీఐజీ రెమా రాజేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఎఫ్‌ఎస్‌ఎల్ వెబ్‌సైట్, భరోసా కేంద్రాలు మంచి ఫలితాలనిస్తాయన్నారు. జనాల్లో మరింత భద్రతా భావాన్ని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అడిషనల్ డీజీ శిఖాగోయల్ మాట్లాడుతూ.. కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల
ములుగు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వనపర్తిల్లో కొత్తగా భరోసా సెంటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2013 నుంచి గతేడాది వరకు భరోసా సెంటర్ల ద్వారా 4,782 పోక్సో కేసులు,1,163 అత్యాచార కేసుల్లో బాధితులకు సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీలు అపూర్వ రావు, రమణకుమార్, జగదీశ్‌రెడ్డి, దేవేందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.