వనం వీడి జనంలోకి సమ్మక్క..కాసేపట్లో గద్దెలపైకి

వనం వీడి జనంలోకి సమ్మక్క..కాసేపట్లో గద్దెలపైకి

మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు  చిలుకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకొస్తున్నారు. అర్థరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెల పైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది.

  మేడారం నుంచి చిలకలగుట్టకు వెళ్లిన పూజారులు అక్కడ గంట పాటు ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబురం మధ్య అమ్మ అడవి నుంచి బయల్దేరింది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్టించే సమయంలో తీవ్ర ఉద్విఘ్నత చోటు చేసుకోనుంది.

 శివసత్తుల పూనకాలు... భక్తుల జయజయ ధ్వానాల మధ్య జరిగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్టలతో గిరిజన పూజారాలు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల పైకి తీసుకొస్తున్నారు.  ములుగు జిల్లా ఎస్పీ అమ్మ రాకకు సంకేతంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్రమంత్రి సీతక్క, కలెక్టర్ జంపన్న వాగు సమీపంలో అమ్మకు అధికారికంగా స్వాగతం పలకారు.