
లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు ప్రధాన ఉద్దేశం రాజ్యాంగ నైతికతను నిలబెట్టడం, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం. బిల్లు ప్రతిపాదకుల వాదన ప్రకారం, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపాలుగా ఉన్న ప్రజా ప్రతినిధులు, ఎలాంటి సందేహాలకు తావు లేకుండా అత్యున్నత ప్రమాణాలను పాటించాలి. ఒక మంత్రి తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై, నిర్బంధంలో ఉన్నప్పుడు, అది ప్రజా విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది అని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ బిల్లు వ్యక్తిగత శిక్ష కంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవాన్ని, పవిత్రతను కాపాడటానికే ఉద్దేశించినదని ప్రభుత్వం పేర్కొంటోంది. నిరసనల మధ్య, భారత రాజ్యాంగం (130వ సవరణ) బిల్లు 2025ను పార్లమెంటరీ సంయుక్త కమిటీకి పంపారు. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఎంపికచేసిన 31 మంది సభ్యులు ఉంటారు. కేంద్ర హోంమంత్రి కోరినట్లుగా, కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల మొదటిరోజులోపు సమర్పించాల్సి ఉంటుంది. శాసనసభ్యులు, మంత్రుల అనర్హతకు సంబంధించి ప్రధానంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఒక ప్రజా ప్రతినిధి కనీసం రెండు సంవత్సరాలు జైలుశిక్షకు గురైతే తన పదవిని కోల్పోతారు. అయితే, ఈ బిల్లు ఈ నిబంధనను దాటి నేర నిరూపణ కాకముందే, కేవలం 30 రోజుల నిర్బంధ ఆధారంగా పదవి నుంచి తొలగించేలా మార్పులు తీసుకురానుంది.
బిల్లులోని కీలకమైన నిబంధనలు
బిల్లు రాజ్యాంగంలోని కొన్ని కీలకమైన ఆర్టికల్స్‌లో మార్పులు తీసుకురానుంది. అవి కేంద్ర మంత్రులకు సంబంధించిన ఆర్టికల్ 75, రాష్ట్ర మంత్రులకు సంబంధించిన ఆర్టికల్ 164, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత మంత్రులకు సంబంధించిన ఆర్టికల్ 239 ఎఎ. ఈ నిబంధనలు అన్నింటికీ ఒకే విధమైన తొలగింపు ప్రక్రియ ఉంటుంది. ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరానికి సంబంధించి 30 రోజులు నిరంతరంగా కస్టడీలో ఉంటే, అది పదవి నుంచి తప్పించడానికి కారణం అవుతుంది. ప్రధాని, ముఖ్యమంత్రుల విషయంలో వారు 31వ రోజు నాటికి రాజీనామా చేయాలి. అలా చేయని పక్షంలో వారు ఆటోమెటిక్‌గా పదవిని కోల్పోతారు.. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల విషయంలో ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి లేదా గవర్నర్ వారిని తొలగిస్తారు. అయితే, 31వ రోజు నాటికి ఈ సలహా ఇవ్వని పక్షంలో కూడా, మంత్రి ఆటోమెటిక్‌గా పదవిని కోల్పోతారు.
తొలగింపు అనేది తాత్కాలికం
ఈ బిల్లులో ఒక ఆసక్తికరమైన, లోతైన చర్చకు దారితీసే నిబంధన కూడా ఉంది. కస్టడీ నుంచి విడుదలైన తర్వాత అదే వ్యక్తిని తిరిగి ప్రధానిగా లేదా మంత్రిగా నియమించవచ్చు. ఇది తొలగింపు అనేది తాత్కాలికం, ప్రక్రియాపరమైనది తప్ప, నైతిక లోపం ఆధారిత శాశ్వత అనర్హత కాదని సూచిస్తుంది. కానీ, ఇక్కడే బిల్లులోని అతిపెద్ద వైరుధ్యం వెల్లడి అవుతున్నది. నేరారోపణలు తొలగిపోకపోయినా, కేవలం కస్టడీ నుంచి విడుదలైనంత మాత్రాన తిరిగి పదవిలోకి రావచ్చని ఈ నిబంధన చెప్పడం, బిల్లు ప్రాథమిక ఉద్దేశ్యమైన 'రాజ్యాంగ నైతికత'ను అపహాస్యం చేస్తోంది. ఇది తర్కరహితంగా, ఆమోదయోగ్యం కానిదిగా కనిపిస్తుంది. అయితే, ఈ బిల్లులోని కొన్ని నిబంధనలు తీవ్ర రాజ్యాంగపరమైన చర్చకు, ఆందోళనలకు దారితీశాయి.
బిల్లుకు వ్యతిరేకంగా వాదనలు
ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పటినుంచి విపక్షాలు, రాజ్యాంగ నిపుణులు, పౌర సమాజ కార్యకర్తలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటగా, ఈ బిల్లు 'నిర్దోషిగా భావించే' ప్రాథమిక సూత్రానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. ఇది మన న్యాయవ్యవస్థకు మూల స్తంభంలాంటిది. ఒక వ్యక్తి నేరం చేశాడని న్యాయస్థానం రుజువు చేయకముందే, కేవలం పోలీసు నిర్బంధం ఆధారంగా పదవి నుంచి తొలగించడం, నేర నిరూపణకు ముందే శిక్ష విధించడమే అవుతుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఈ విధానం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన సమానత్వ హక్కు (ఆర్టికల్ 14), జీవన, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు (ఆర్టికల్ 21)లకు విరుద్ధంగా ఉంటుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండోది, ఈ బిల్లు రాజకీయ దుర్వినియోగానికి అలాగే రాజకీయ ప్రతీకారాలకు దర్యాప్తు సంస్థల ఆయుధాలుగా మారే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించవచ్చు. అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరపరచడానికి, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను (సీబీఐ, ఈడీ వంటివి) దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని రాజ్యాంగ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో, కేంద్ర సంస్థలు ప్రతిపక్ష నాయకులపైనే ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాయని గణాంకాలు కూడా చెబుతున్నాయి.
రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని బలహీనపరుస్తుందా?
30 రోజుల నిర్బంధం అనేది ఒక తక్కువ అడ్డంకి. ముఖ్యంగా బెయిల్ పొందడం కష్టమైన కఠిన చట్టాల (పీఎంఎల్‌ఏ వంటివి) కింద అరెస్టు.. తద్వారా రాజకీయ ప్రత్యర్థులను తొలగించే సాధనంగా మారే అవకాశం ఉంది. ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ, అధికారాల విభజన సిద్ధాంతానికి సవాలు విసురుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రానికి విపరీతమైన అధికారాన్ని ఈ బిల్లు ఇస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. కేంద్ర ఏజెన్సీలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం వల్ల తొలగిస్తే, రాష్ట్ర శాసనసభ అధికారాన్ని నేరుగా అగౌరవపరచినట్లే అవుతుంది. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యతను దెబ్బతీసి, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని బలహీనపరుస్తుంది. తిరిగి నియామకం చేసుకునే నిబంధన బిల్లు నైతిక ఉద్దేశ్యంపైనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒక వ్యక్తిపై ఉన్న నేరారోపణలు తొలగిపోకపోయినా, కేవలం కస్టడీ నుంచి విడుదలైనంత మాత్రాన అతని రాజ్యాంగ నైతికత తిరిగి వస్తుందా? ఇది తొలగింపు అనేది రాజకీయ సౌలభ్యం కోసం తప్ప, నిజమైన రాజ్యాంగ సూత్రాల కోసం కాదని సూచిస్తుంది. ఒక మంత్రిని తాత్కాలికంగా తొలగించి, ఆ తర్వాత రాజకీయ వాతావరణం అనుకూలించినప్పుడు తిరిగి నియమించవచ్చు, దీని వల్ల మొత్తం ప్రక్రియ హాస్యాస్పదంగా మారవచ్చు.
ప్రత్యామ్నాయ మార్గాలు
ప్రపంచవ్యాప్తంగా, ప్రజా ప్రతినిధులు నేరారోపణలు ఎదుర్కొన్నప్పుడు వారి జవాబుదారీతనం ఒక సంక్లిష్టమైన అంశం. చాలా పరిణతి చెందిన ప్రజాస్వామ్యాలు, నేర నిరూపణ ఆధారిత న్యాయ ప్రక్రియలపైనా, లేదా రాజీనామాలను తప్పనిసరి చేసే రాజకీయ సంప్రదాయాలపైనా ఆధారపడతాయి. ఈ బిల్లు ఉద్దేశ్యం మంచిదే అయినా, అమలుచేసే విధానం లోపభూయిష్టంగా ఉంది. రాజ్యాంగ నిపుణులు కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు. జైలు నిర్బంధానికి బదులుగా, న్యాయస్థానం నేరారోపణలు నమోదు చేసినప్పుడు మాత్రమే తొలగించే నిబంధన అమలుచేయాలి. కొత్త రాజ్యాంగ సవరణకు బదులుగా, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 వంటి ఇప్పటికే ఉన్న చట్టాలను బలోపేతం చేయాలి. అటువైపుగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి బిల్లు తెచ్చే ముందు ప్రతిపక్షాలను, న్యాయనిపుణులను విశ్వాసంలోకి తీసుకుంటే, ఇలాంటి అనుమానాలు రేకెత్తేవి కావు.
- డా. కట్కూరి,
సైబర్ సెక్యూరిటీ, న్యాయ నిపుణుడు