24 సార్లు ఓడినా..ఆస్తులమ్మి పోటీ చేస్తున్నవృద్ధుడు

24 సార్లు ఓడినా..ఆస్తులమ్మి పోటీ చేస్తున్నవృద్ధుడు

“బూటు గుర్తుకే ఓటేయండి” అంటూ కాటన్ ధోతీ,రుమాలు, పొడవాటి గడ్డంతో 73 ఏళ్ల వృద్ధుడు పుణె నగరంలో స్టీల్ కార్ట్ (తోపుడు బండి)ను తోసుకుంటూ, ప్లకార్డును ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. లోక్ సభ ఎన్నికల్లో తనకు ఓటేయాలని గల్లీ గల్లీ తిరిగి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాడు.పుణె లోని శివాజీ నగర్ లో అందరికీ బాగా తెలిసిన ఆ వృద్ధుడి పేరు విజయ్ ప్రకాశ్ కొండెకార్. ఇప్పటి వరకు 24 వేర్వేరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి అదృష్టపరీక్షకు దిగాడు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన ఆయన రెండు నెలలుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాల్లోకి రావాలంటే పార్టీలొక్కటే మార్గం కాదని నిరూపించాలని అనుకుంటున్నా. దేశానికి నాలాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్లను ఇవ్వాలని అనుకుంటున్నా. అవినీతి లేకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం . ఏదో ఒకరోజు ప్రధాని అవుతా.ప్రతి పౌరుడికి రూ.17 వేలు చొప్పున ఇస్తా. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంటే ఇది సాధ్యమే” అని విజయ్ ప్రకాశ్ అన్నారు. తనను చూస్తే కొందరికి వినోదంగా ఉంటుందని, మరి కొందరైతే అసలు పట్టించుకోరని, మరికొందరు సెల్ ఫీ దిగుతున్నారని,సోషల్ మీడియాలో ఫ్రీ పబ్లిసి టీ కూడా వస్తోందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగిన వందలాది ఇండిపెండెంట్లలో విజయ్ ప్రకాశ్ కొండెకార్ కూడా ఒకరు. ఎన్నికల ప్రచారం కోసం పూర్వీకుల నుం చివచ్చిన భూమిని, ఇంటిని కూడా అమ్మేశారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆదాయ వనరు నెలకు రూ.1921పెన్షన్ మాత్రమే. ” నేను చివరి వరకూ ప్రయత్నిస్తూనే ఉంటా. వయసు రీత్యా ఇవే చివరి ఎన్నికలు కావచ్చు.అయితే ఈ సారి ఫలితం డిఫరెంట్ గా ఉంటుందని ఆశిస్తున్నా” అని అన్నారు. ఈవీఎంలో తన పేరు చివర్లో ఉంటే సులువుగా ప్రచారం చేసుకోవచ్చని ఆయన తన ఇంటి పేరును ఝడ్ అక్షరం వచ్చేలా మార్చుకున్నారు. 1980కి ముందు ఆయన మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేశారు.