రాష్ట్రంలో కొత్త పార్టీ.. ఎవరు పెడ్తరు? ఎప్పుడు పెడ్తరు?

రాష్ట్రంలో కొత్త పార్టీ..  ఎవరు పెడ్తరు? ఎప్పుడు పెడ్తరు?
  • కేసీఆర్​ చెప్పిన ఆ పార్టీ ఎవరిది?
  • టీఆర్​ఎస్​కు జంపింగ్​ల భయం..
  • ఇలాంటి టైంలో ప్రయోగం వద్దనుకొనే ‘కేటీఆర్​ సీఎం’పై కేసీఆర్​ వెనక్కి

రాష్ట్రంలో కొత్త పార్టీ విషయాన్ని సీఎం కేసీఆర్​ ప్రస్తావించటం అన్ని రాజకీయ వర్గాల్లో సంచలనానికి దారితీసింది. ఇంతకీ ఎవరు పార్టీ పెట్టబోతున్నారు?.. ఎప్పుడు పెట్టబోతున్నారు?.. అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతున్నదని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అదే విషయంపై ఇంటెలిజెన్స్​ వర్గాలు ఇచ్చిన  పక్కా సమాచారం మేరకే  కొత్త పార్టీ అంశాన్ని టీఆర్​ఎస్​ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్​ ప్రస్తావించినట్లు గులాబీ లీడర్లు అంటున్నారు. కేసీఆర్​ తన కొడుకు కేటీఆర్​ను సీఎం చేసే ఆలోచనను విరమించుకోవటం వెనుక అది కూడా ఓ కారణమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

హైదరాబాద్, వెలుగు: కొత్త పార్టీ పెట్టడమంటే పాన్ షాప్​ పెట్టినంత, పాటలు పాడినంత ఈజీ కాదని మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్​ అనడం వెనుక మతలబు ఏందని టీఆర్​ఎస్​​లీడర్లు చర్చించుకుంటున్నారు. కొత్త పార్టీ వస్తే తమ పార్టీ నుంచి జంపింగ్​లుంటాయా..?, పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? అని ఒకరికొకరు ఆరా తీస్తున్నారు. ఉద్యమం నాటి నేతలు, పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు ఇతర పార్టీలకు జంప్​ అవుతారనే భయం టీఆర్​ఎస్​ను  కొంతకాలంగా వెంటాడుతోంది. అదే జరిగితే పార్టీలో సెగ రగులుతుందని భావించే లీడర్లపై కేసీఆర్​ ఫైర్​ అయినట్లు  స్పష్టమవుతోంది. ఎవరు పార్టీ పెట్టబోతున్నారనే విషయం చెప్పకుండానే, ‘‘కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీనా? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు?.. నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు. ఎటూకాకుండా తెరమరుగై పోతారు’’ అని కేసీఆర్​ కామెంట్​ చేయడం రకరకాల చర్చలకు తెరతీసినట్లయింది. కొత్త పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్న ఒకరిద్దరు ముఖ్య నేతలను టార్గెట్​ చేసుకొనే ఆయన ఈ కామెంట్లు చేసినట్లు టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు. ఇటువంటి టైమ్​లో ప్రయోగాలు చేయటం సరైంది కాదని భావించే కేటీఆర్​ను సీఎం చేయాలనే  ఆలోచనను వెనక్కి తీసుకున్నట్లు వారు అంటున్నారు.

ఇదే మంచి టైమింగ్​?

కొంతకాలంగా రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఫలితాల్లో వెనుకబడటంతో పాటు వరుసగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బెడిసికొడుతున్నాయి. ధరణి, ఎల్​ఆర్​ఎస్, వరద సాయం​, షరతుల సాగు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసే ప్రకటనలు.. ఇలా వరుసగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపడేశాయి. కేసీఆర్​ ప్రగతిభవన్​కు పరిమితం కావటం, మంత్రి కేటీఆర్​ చుట్టూ టీఆర్​ఎస్​ లీడర్లు చక్కర్లు కొట్టడంతో అధికార పార్టీలోనూ అయోమయానికి కారణమయ్యాయి. ఇలాంటి టైమ్​లో రాష్ట్రంలో కొత్త  ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆర్థిక బలం, జనం అండదండలున్న లీడర్లు కొత్త పార్టీల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

యువనేత దూకుడు

ప్రధాన పార్టీకి చెందిన ఒక యువ నేత ఇప్పటికే కొత్త పార్టీ ఏర్పాటుకు పావులు సిద్ధం చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది. రాష్ట్రంలో తనకున్న బలమైన కులం అండదండలతో ఏ క్షణమైనా పార్టీ జెండా ఎగరేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఈయనకు సహకరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో  మద్దతు కూడగట్టిన తర్వాత యువనేత కొత్త పార్టీని అనౌన్స్​ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈయనకు ఏపీకి చెందిన ఒక బడా నేత ఆశీస్సులుండటం ప్లస్​ పాయింట్​. రాష్ట్రంలో తగ్గుతున్న టీఆర్​ఎస్​ ఆదరణను క్యాష్​ చేసుకోగలిగితే.. కనీసం 30 సీట్లు గెలిచే చాన్స్​ ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో అవే కీలకమవుతాయన్న ముందస్తు అంచనాలతోనే కొత్త పార్టీ ఎజెండా ప్రిపేరైనట్లు  తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్త యాత్రలు, యూత్​ను, రైతులను ఆకట్టుకునే ప్రోగ్రాంలతో ఇప్పటికే ఈ  యువనేత జనంలో దూకుడుగా ఉన్నారు.

జగన్​ చెల్లెలు ఎంట్రీ?

ఏపీ సీఎం జగన్​ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఆమె ఏపీ రాజకీయాల్లో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. బెంగళూరులో ఉంటున్న షర్మిల మంగళవారం హైదరాబాద్​లోని లోటస్​పాండ్​లో కొందరు ముఖ్య నేతలతో సమావేశమవనున్నారు. కొత్త పార్టీ  పెట్టాలా, లేదా.. అనే విషయాన్ని ఈ మీటింగ్​లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. చెల్లెలి పార్టీకి  అన్న జగన్​ మద్దతు ఉందని, ఆయనే గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. ఇదే టైమ్​లో కేసీఆర్​ చేసిన కామెంట్లు.. షర్మిల పెట్టే కొత్త పార్టీని ఉద్దేశించినవేనా..? అనే చర్చ కూడా మొదలైంది. కానీ.. షర్మిలను టీఆర్​ఎస్​ అంత సీరియస్​గా తీసుకుంటుందా..? అనే సందేహాలు అన్ని పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి.