రాష్ట్రానికి భారీ వర్ష సూచన

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

గత నెల రోజులుగా కురుస్తున్న వానలకు తెలంగాణ చిగురుటాకులా వణికిపోతోంది. రాష్ట్రంలో వద్దంటే వానలు పడుతున్నాయి. వరుణుడు పగబట్టినట్టు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈనెల 7న వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఏపీ కోస్తా తీర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనితో పాటు విదర్భ నుంచి తెలంగాణ వరకు సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో 7వ తేదీ లేదా ఆ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైద‌రాబాద్‌ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది