మినిమమ్ శాలరీ 13 వేలు ఇవ్వాల్సిందే

మినిమమ్ శాలరీ 13 వేలు ఇవ్వాల్సిందే

పంచాయతీరాజ్​ స్వీపర్ల కేసులో ప్రభుత్వానికి  హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్‌‌ స్కూళ్లలో స్వీపర్లుగా పని చేసే సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్‌‌ శాలరీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన గైడ్​లైన్స్​ను అమలు చేయాలని, పిటిషనర్లకు నెలకు రూ.13 వేలు చొప్పున జీతం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలి ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో పంచాయతీరాజ్‌‌ స్కూళ్లలో స్వీపర్లుగా పనిచేసే టి. అంజయ్య సహా మరో 40 మంది మినిమం టైమ్ స్కేల్‌‌ అమలు చేయాలంటూ కోర్టులో రిట్‌‌ పిటిషన్ వేశారు.

నెలకు రూ.1,623 నుంచి రూ.4 వేల మధ్య పిటిషనర్లకు జీతంగా ఇస్తున్నారని, సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం మినిమం​స్కేల్‌‌ ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు లాయర్​ శ్రీనివాస్‌‌ కోర్టుకు వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, జీతాలు మాత్రం నామమాత్రంగా కూడా లేవని వివరించారు. వాదనల తర్వాత పిటిషనర్లకు మినిమం టైమ్ స్కేల్‌‌ జీతాలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కౌంటర్‌‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులిచ్చారు. తర్వాతి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.