
సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 97 ‘తేజస్’ తేలికపాటి యుద్ధవిమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు వాయుసేనకు చెందిన 84 ‘సుఖోయ్-30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం తెలిపింది.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (DAC) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయా ఒప్పందాల విలువ దాదాపు రూ.1.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. తేజస్ ‘మార్క్ 1-ఏ’ యుద్ధ విమానాలను వాయుసేన కోసం, హెలికాప్టర్లను వాయుసేనతోపాటు ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నారని తెలుస్తోంది.
‘తేజస్’ తేలికపాటి యుద్ధవిమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దీన్ని రూపొందించింది. యాక్టివ్ ఎలక్ట్రానిక్- స్కాన్డ్ అర్రే రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ వంటి సామర్థ్యాలు దీని ప్రత్యేకత. ‘ప్రచండ్’నూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. ఈ హెలికాప్టర్ల మొదటి బ్యాచ్‌ను గత సంవత్సరం వాయుసేన, సైన్యంలోకి చేర్చారు. 21 వేల అడుగుల ఎత్తులోనూ సేవలు అందించగలదు. సియాచిన్, లడ్డాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మోహరించేలా దీన్ని రూపొందించారు.