ఆగిన అర్బన్ భగీరథ..ఇంటింటికి తాగునీరేది?

ఆగిన అర్బన్ భగీరథ..ఇంటింటికి తాగునీరేది?
  • మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ ఇంటర్నల్ ​పనులకు మూడేళ్ల కింద టెండర్లు
  • 30 శాతం కాంట్రాక్టర్, 70 శాతం బ్యాంకు లోన్లతో చేపట్టాలని అగ్రిమెంట్​
  • సర్కారు ఆర్థిక పరిస్థితి బాలేదని.. కాంట్రాక్టు సంస్థకు లోన్లు ఇవ్వని బ్యాంకులు
  • ఫండ్స్​ లేక చేతులెత్తేసిన కాంట్రాక్టు సంస్థ
  • ఇప్పటికి 20% పనులే పూర్తి
  • మళ్లీ రెగ్యులర్ టెండర్లు

వరంగల్, వెలుగు: టౌన్లలో ఇంటింటికీ తాగునీళ్లిచ్చేందుకు చేపట్టిన అర్బన్​ భగీరథ పథకం మధ్యలోనే ఆగిపోయింది. 38 మున్సిపాలిటీలను మూడు ప్యాకేజీలుగా విభజించి.. 2017లో ‘మోడీఫైడ్ యాన్యుటీ మోడ్’విధానంలో టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకురాలేదు. ఇప్పటికీ 20 శాతానికి మించి పనులు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్​ మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించాలని 2016లో సర్కారు నిర్ణయం తీసుకుంది. 38 మున్సిపాలిటీలను మూడు ప్యాకేజీలుగా విభజించి, టెండర్లు పిలిచింది. ప్యాకేజీ–2లో పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, పెద్దపల్లి, వేములవాడ, మహబూబాబాద్, మధిర.. ప్యాకేజీ–3లో జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లందు, బెల్లంపల్లి, భైంసా, కాగజ్​నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్, జనగామ, గద్వాల, నారాయణపేట, వనపర్తి, భువనగిరి, తాండూరు, వికారాబాద్​, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి.

ప్యాకేజీ–1కింద హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏడు మున్సిపాలిటీలను చేర్చారు. ఈ పనులు స్టార్ట్​ చేసేందుకు 2016 అక్టోబర్ లోనే రూ.4,403 కోట్లకు సర్కారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. దీనికి సంబంధించి ‘మోడిఫైడ్ యాన్యుటీ మోడల్’ ప్రకారం 2017 సెప్టెంబర్​లోనే టెండర్ ప్రక్రియ పూర్తయింది. ‘రాఘవ వాటర్ వర్క్స్’ సంస్థ​దక్కించుకుంది.

బ్యాంకులు ముందుకు రాలే..

కోట్ల రూపాయల కాంట్రాక్టు కావడం, మోడిఫైడ్ యాన్యుటీ మోడల్​ ప్రకారం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొనే చాన్స్​ ఉండడంతో మొదట్లో పనులు దక్కించుకునేందుకు కొన్ని బడా సంస్థలు పోటీ పడ్డాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సీన్​ రివర్స్ అయింది. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల విషయం తెలియడంతో కాంట్రాక్టు సంస్థకు లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంకు కూడా ముందుకు రాలేదని తెలిసింది. మొదట సొంత నిధులతో కొన్ని పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థకు తర్వాత నిధుల కొరత మొదలైంది. చివరికి పనులు ఆగిపోయాయి.

రెగ్యులర్ టెండర్లకు కసరత్తు

రాష్ట్ర సర్కారు నుంచి ఇప్పుడప్పుడే నిధులు వచ్చే అవకాశం లేకపోవడం, బ్యాంకులు కూడా ముందుకు రాకపోవడంతో కాంట్రాక్టు సంస్థ అగ్రిమెంట్​ నుంచి తప్పుకుంది. దీంతో సర్కారు తాజాగా రెగ్యులర్ టెండర్లకు రెడీ అవుతోంది. నెలన్నర కింద రెగ్యులర్ పద్ధతిలో టెండర్ నిర్వహణకు ఆఫీసర్లు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కొన్ని సంస్థలు టెండర్లు దాఖలు చేయగా.. ప్రస్తుతం సీవోటీ (కమిషన్ ఆఫ్ టెండర్స్) వద్ద ఉన్నాయి. సీవోటీలోని బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ టెండర్లను పరిశీలించే పనిలో పడ్డారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితేనే మున్సిపాలిటీల్లోని మిషన్ భగీరథ పనుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది.

ఏమేం పనులు చేయాలె..

అగ్రిమెంట్లో భాగంగా టౌన్లలో మిషన్​భగీరథ మెయిన్​ పైపులైన్​ నుంచి ఇంటర్నల్​ పైపులైన్లు వేయాలి. ఇంటింటికీ నల్లా కనెక్షన్​ ఇచ్చే క్రమంలో ఇతర పైపులైన్లు, డ్రైనేజీలు, రోడ్లకు ఎలాంటి డ్యామేజీ జరిగినా కాంట్రాక్టు సంస్థే రిపేర్లు చేయాలి. ఏడేండ్ల పాటు పథకాన్ని నిర్వహించాలి. మొత్తంగా 2018 చివరినాటికే పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. అయితే కాంట్రాక్టు ఒప్పందం జరిగి నాలుగేళ్లు కావస్తున్నా 20 శాతం మేర మాత్రమే పనులు జరిగాయని ఆఫీసర్లు అంటున్నారు.

నెలాఖరుకల్లా టెండర్లు ఖరారు

బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం వల్ల మోడిఫైడ్ యాన్యుటీ మోడ్ టెండర్స్​ క్యాన్సిల్ చేశాం. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా నార్మల్ టెండర్లు కూడా పిలిచాం. ఈ మేరకు కొన్ని సంస్థలు టెండర్ వేయగా అవి ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ వద్ద ఉన్నాయి. వారు ఫైనల్ చేస్తే ఈ నెలాఖరు కల్లా టెండర్ ఖరారు చేసే అవకాశం ఉంది.
– శ్రీనివాసరావు, ఎస్ఈ,
పబ్లిక్ హెల్త్, వరంగల్ సర్కిల్

వర్మ రెస్ట్ ఇన్ పీస్..ఆర్జీవిపై మండిపడ్డ అమృత