- వరంగల్లో టెక్స్టైల్ పార్క్ బాధితుల ఆందోళన
- గతంలోనే జాగలిచ్చి ఎకరాకు రూ.40 లక్షలు నష్టపోయినం
- మళ్లీ మా జోలికి రామన్నరు
- ఇప్పుడు భూముల కోసం నోటీసులు పంపించిన్రు
- పురుగుల మందు డబ్బాలతో నిరసన
వరంగల్, సంగెం (పర్వతగిరి), వెలుగు: 'కాకతీయ మెగా టెక్స్టైల్స్ పేరుతో గతంలో మా భూములు గుంజుకున్నరు. ఒక్కో ఎకరానికి రూ.50 లక్షలు రేటుంటే రూ.10 లక్షల చొప్పున కట్టించిన్రు. అప్పుడు చాలా నష్టపోయినం. ఇప్పుడు గీసుగొండ శాయంపేట శివారులో ఉండే మా భూములను మళ్లీ గుంజుకుంటమంటున్నరు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మా పొలాల జోలికొస్తే చస్తామని చెప్పినం. మీరు సచ్చినా పర్లేదు.. టెక్స్టైల్పార్కుకు భూములియ్యాల్సిందే' అని అంటున్నారంటూ అంటూ బాధిత రైతులు శుక్రవారం వారి పొలాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. సర్వే పేరుతో తమ భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తే చస్తామంటూ చేతిలో పురుగుల మందు బాటిళ్లతో ఆందోళన చేశారు.
అప్పట్లోనే 1200 ఎకరాలు తీసుకున్నరు
వరంగల్ జిల్లా గీసుగొండ , సంగెం మండలాల శివారులో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్పార్క్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరోక్షంగా రైతుల నుంచి భూసేకరణ చేసే బాధ్యత తీసుకున్నారు. 2016లో 1150 నుంచి 1200 ఎకరాల వరకు సేకరించారు. భూములు ఇచ్చిన రైతులకు పార్క్స్థలంలో డబుల్ బెడ్‍రూం ఇండ్ల ప్లాట్లు, ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి మాత్రమే భూసేకరణ ఉంటుందని, భవిష్యత్‍లో మిగతా భూముల జోలికి రామని చెప్పి తీసుకున్నారు. ఎకరం రూ.50 లక్షలు ఉంటే కేవలం రూ.10 లక్షలు ఇస్తున్నారంటూ రైతులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. చివరకు రైతుల భూములు పోయాయి. ప్రభుత్వం సేకరించిన భూముల వరకు గోడలు కట్టారు. ఇదంతా గతం. కాగా, ప్రస్తుతం పార్క్స్థలంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ నెలలో కైటెక్స్ కంపెనీ ఏర్పాటు పనులను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
శ్రీమంతులం అవుతారన్నరు
పార్కు కోసం భూమి సేకరించే సమయంలో రైతుల మిగతా భూముల జోలికి వచ్చే ప్రసక్తి లేదని.. ఆ జాగలకు డిమాండ్ పెరిగి రైతులు శ్రీమంతులవుతారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఇప్పుడు మరో 34 మంది రైతులకు చెందిన 13 ఎకరాల 29 గుంటల భూములు కైటెక్స్కంపెనీకి ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. దీంతో రైతులు వ్యతిరేకించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారంటూ జులైలో ధర్నా చేశారు. అయినా ఆఫీసర్లు త్వరలోనే భూముల్లో సర్వే చేస్తామని చెప్పడంతో నిద్రల్లేని రాత్రులు గడుపుతున్నారు. భూముల సర్వే కోసం శుక్రవారం అధికారులు వస్తున్నారనే సమాచారంతో రైతులు, వారి కుటుంబసభ్యులు పురుగు మందు డబ్బాలతో అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. తమ కొడుకు, బిడ్డలకు రాసిచ్చిన భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తమ భూముల వద్దకొస్తే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు.
గతంలో ఎకరం తీసుకున్నరు
గతంలో టెక్స్టైల్పార్కు కింద ఎకరం పోయింది. రూ.50 లక్షల రేటుంటే రూ.10 లక్షలే ఇచ్చిన్రు. అప్పుడే వారికిచ్చిన భూములకాడికి గోడ పెట్టుకున్నరు. నాలుగు నెలల నుంచి మళ్లీ భూములు కావాలంటున్నరు. మా భూముల జోలికొస్తే సచ్చిపోతామని చెబితే.. 'మీరు చనిపోయినా సరే.. భూములియ్యాలే' అంటున్రు. మాకున్న రెండెకరాల్లో కొంత భాగాన్ని అప్పట్లోనే మా ఆడబిడ్డలకు రాసిచ్చినం. ఇప్పుడు వారు మా ఇండ్లమీదికి వస్తున్నరు. ఏం చేయాల్నో తెలుస్తలేదు.
- సముద్రాల కవిత (మహిళా రైతు)
ఎమ్మెల్యే టార్చర్ పెడుతుండు
గతంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సారు పార్కు పేరు చెప్పి మా భూములు తీసుకున్నడు. భూములిస్తే మిగిలిన భూమితో కోటిశ్వరులం అయితమన్నరు. నాకున్న భూమిని ఐదుగురు బిడ్డలకు రాసిచ్చిన. ఇప్పుడు ఉన్న రెండెకరాలు పోయాక మా బతుకేంది? భూములియ్యాలంటూ మా బిడ్డలను టార్చర్ పెడుతున్నరు. మా భూములు తీసుకుంటే మా బతుకులు, మా పిల్లల బతుకులు ఆగమైతయ్. సచ్చుడు ఒక్కటే ఉంటది. సర్కారు జర ఆలోచన చేయాలె.
– సముద్రాల పెద్ద సాంబయ్య
కోట్లు ఇచ్చినా భూములియ్యం
రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం మా బిడ్డకు రాసిచ్చినం. అప్పుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి వచ్చి పార్కుకు రెండున్నర ఎకరాలు తీసుకున్నరు. 10 లక్షల చొప్పున కట్టించిన్రు. మరోసారి భూములు అడగేది లేదని, తమకు ఇయ్యంగ మిగిలిన భూమికి మస్త్డిమాండ్ వస్తదని చెప్పిండు. మీరు ధనవంతులు అయిపోతరు అన్నరు. ఇప్పుడేమో మళ్లీ ఆ భూములే ఇయ్యాలని అడుగుతున్నరు. లోకల్ లీడర్లను పంపిస్తున్నరు. చావనైనా చస్తాం కానీ, ఎకరానికి రెండు కోట్లు ఇచ్చినా భూములియ్యం.
– అనసూర్య (బాధిత రైతు)
