ఆసరా కన్నా.. బాయి పనోళ్ల  పింఛనే తక్కువ! 

ఆసరా కన్నా.. బాయి పనోళ్ల  పింఛనే తక్కువ! 

ఈయన పేరు మేడి మల్లయ్య, సింగరేణి రిటైర్డ్​ కార్మికుడు. శ్రీరాంపూర్ ఏరియా  ఆర్కే 6 మైన్​లో టింబర్​మన్​గా పనిచేసి 1995లో రిటైర్​అయ్యాడు. ప్రస్తుతం మల్లయ్యకు  నెలకు కేవలం రూ.394 పెన్షన్ వస్తోంది. 30 ఏండ్ల పాటు బొగ్గుబాయిలో పనిచేయడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. కానీ నెలనెలా వచ్చే పింఛన్ పైసలు​ మందులు కొనుక్కోవడానికి కూడా సాల్తలేవ్​. దీంతో కుటుంబ కనీస అవసరాలు తీర్చుకునేందుకు మల్లయ్య అష్టకష్టాలు పడుతున్నడు. 

మందమర్రి, వెలుగు: నేల పొరల్లో మొసమర్రని చోట 30 ఏండ్ల పాటు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బొగ్గు తవ్వకాలు చేసిన  రిటైర్డ్​ కార్మికులపై సర్కారు దయచూప్తలేదు.  తమ యావత్​ జీవితాన్ని బొగ్గు గనుల్లోనే మసి చేసుకొని రోగాలపాలైనప్పటికీ జీవిత చరమాంకంలో కనీసం మందుల కొనుగోలుకు సైతం సాలినంత పింఛన్​ ఇస్తలేదు. ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా  వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛనే రూ.2వేలు ఉండగా, సింగరేణి రిటైర్డ్​ కార్మికులకు వచ్చే కనీస పింఛన్​ కేవలం రూ.350  మాత్రమే. ఈ క్రమంలో పింఛన్​ పెంచాలంటూ 20ఏళ్లుగా నల్లసూర్యులు ఉద్యమిస్తున్నా ఇటు సింగరేణి యాజమాన్యంగానీ, అటు ప్రభుత్వాలుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో చివరి రోజుల్లో రిటైర్డ్ కార్మికులు కనాకష్టంగా కాలం ఎల్లదీస్తున్నారు. 
కనీస పింఛన్ ఇంకా​ రూ.350
అత్యంత ప్రమాదకరమైన బొగ్గు గనుల్లో దినదిన గండగా 35 నుంచి 40ఏళ్ల పాటు పనిచేసిన రిటైర్డ్​ ఎంప్లాయిస్ కు కనీస పింఛన్​ ఇప్పటికీ రూ.350 మాత్రమే ఉంది.  సుమారు  20వేల మంది రూ.వెయ్యి కంటే తక్కువ పెన్షన్ అందుకుంటుండగా, వీరిలో 2000‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంవత్సరానికి ముందు రిటైర్​అయిన  మెజార్టీ ఎంప్లాయిస్  రూ.300 నుంచి రూ.500తో సర్దుకుంటున్నారు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 84,808 మంది ఎంప్లాయిస్ పెన్షన్​ పొందుతున్నారు. వీరిలో  19,128 మందికి రూ.వెయ్యి కన్నా తక్కువ, 14,431మందికి రూ.1000నుంచి 2000 మధ్య, 3,559 మందికి రూ.3వేల నుంచి 4000 వరకు, 2390 మందికి  రూ.4నుంచి 5వేల మధ్య, 2,032 మందికి రూ.5వేల  నుంచి రూ6వేల వరకు పింఛన్​ వస్తోంది. మరో 35,227 మంది మాత్రమే రూ.6వేల పైన పెన్షన్ పొందుతున్నారు.
ఇప్పటివరకు సవరించలే.. 
నెలకు రూ.350 నుంచి రూ.వెయ్యి లోపు పెన్షన్ పొందేవారు సింగరేణితో పాటు కోలిండియా పరిధిలోని వివిధ రాష్ట్రాల్లో సుమారు మూడు లక్షల మందికిపైగా ఉన్నారు. కోల్​మైన్స్​ ఎంప్లాయిస్​కు కోల్ మైన్స్​ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ స్కీం ను1998 లో అమల్లోకి తెచ్చారు. దీనిని మూడేళ్లకోసారి సవరించాలని నిబంధన రూపొందించినా ఇప్పటివరకు సవరించలేదు. స్కీం వచ్చేనాటికి బొగ్గు పరిశ్రమల్లో ఐదో వేజ్ బోర్డు అగ్రిమెంట్ అమలులో ఉంది. అప్పటి బేసిక్ శాలరీ, డీఏ కలిపి పది నెలల్లో ఎంతవుతుందో, అందులో 25శాతాన్ని పెన్షన్​గా నిర్ణయించారు. అదే మొత్తాన్ని నెలవారీగా అందజేస్తున్నారు. ఎంప్లాయిస్ చనిపోతే  భార్యకు 60శాతం మొత్తాన్ని అందిస్తున్నారు. ఐదో వేజ్​బోర్డు కాలంలో  మినిమమ్ బేసిక్ సాలరీ నెలకు రూ.1700 ఉండేది. నెల వేతనం రూ.2138 లభించేది. అప్పటి ధరల ప్రకారం ఈ వేతనానికి కనీస పెన్షన్ రూ.300 వచ్చినా రిటైర్​ ఎంప్లాయిస్  జీవితం గడిచేది. గతానికి ఇప్పటికీ నిత్యావసరాల ధరలు పోలిస్తే అనేకరెట్లు పెరిగాయి. కానీ రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షన్ మాత్రం పెరగలేదు.  
సీఎంపీఎఫ్​ పెన్షన్​ ఫండ్ లో భారీ లోటు.. 
దేశవ్యాప్తంగా బొగ్గు గని ఉద్యోగుల నుంచి కట్​చేసే మొత్తాన్ని సీఎంపీఎఫ్ పెన్షన్ ఫండ్(నిధి) కు జమ చేస్తారు. క్రమేణా ఉద్యోగుల సంఖ్య తగ్గడం, రిటైర్డ్​​ ఎంప్లాయిస్​కు చెల్లింపులు పెరగడంతో సీఎంపీఎఫ్​లో వేల కోట్ల లోటు ఏర్పడింది. దీంతో పెన్షన్ సవరణ సాధ్యం కాదంటూ సీఎంపీఎఫ్ ట్రస్టు బోర్డు చేతులెత్తేసింది. లోటును పూడ్చేందుకు  2020 నవంబర్​లో జాయింట్ బైపార్టెడ్​ కమిటీ ఫర్ కోల్ ఇండస్ర్టీ(జేబీసీసీఐ) కొన్ని ప్రతిపాదనలు చేసింది. ప్రతి టన్నుకు రూ.25చొప్పున పెన్షన్ ఫండ్​కు జమచేయాలన్నది ప్రధాన సూచన. ఈ క్రమంలోనే టన్ను బొగ్గుకు రూ.10చొప్పున జమ చేసేందుకు కోలిండియా యాజమాన్యం 2020 నవంబర్​లో  నిర్ణయం తీసుకుంది. 2020–21 ఫైనాన్సియల్​ ఇయర్​లో కోలిండియా 716 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ గా పెట్టుకుంది. దీంతో సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డుకు సుమారు రూ.7,160 కోట్లు జమకానున్నాయి. మరోవైపు  సింగరేణి యాజమాన్యం జనవరి, 2021లో టన్నుకు రూ.10 చొప్పున జమచేసేందుకు ఒకే చెప్పింది. దీంతో సింగరేణి నుంచి సుమారు రూ.70కోట్ల వరకు సీఎంపీఎఫ్​కు జమ కానుంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్​ కార్మికుల పెన్షన్​ పెంచాలనే డిమాండ్​ ఊపందుకుంది.
 

కూరగాయలు అమ్ముకుంటున్న
నాభర్త మల్లయ్య ఆర్కే6 గనిలో పనిచేస్తూ పదేళ్ల కింద చనిపోయిండు. అప్పటి నుంచి నాకు నెలకు విడో పెన్షన్ రూ.450 వస్తోంది. అవి ఏమూలకూ సాల్తలెవ్వు. దీంతో నలుగురు పిల్లలను సాదేందుకు కూరగాయలు అమ్ముకుంటున్న. నా భర్తకు సింగరేణి నౌకరి అన్న మాటే గాని మా బతుకులు మాత్రం మారలే. ఇప్పటికైనా పెన్షన్​ పెంచి మాలాంటి రిటైర్డ్​ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలె.                                                                                                                                                       - కాంపెల్లి నాగమ్మ, రామకృష్ణాపూర్
పెన్షన్​ పెంచాలె
సింగరేణిలో  1975 నుంచి 2003 వరకు పనిచేసి రిటైర్ ​అయిన. సుమారు 30 ఏండ్లు బొగ్గుబాయిల పనిచేస్తే నెలకు రూ.1400 పెన్షన్ ఇస్తున్నరు. నాకు నలుగురు కొడుకులు. వాళ్లంతా కూలి పనిచేసుకొని ఎవరికివాళ్లు బతుకుతున్రు. నన్ను సాదే పరిస్థితి లేదు. నాకు వచ్చే పెన్షన్ డబ్బులు ఎటూ సాల్తలేవు.  కూలిపనికి పోదమంటే సాతనైతలేదు. కంపెనీ ఆఫీసర్లు మాలాంటి రిటైర్​ కార్మికులపై దయచూపాలె. పెన్షన్​ పెంచి ఇయ్యాలె.                                                                                                          - మడిపెల్లి రాజయ్య, రామకృష్ణాపూర్

కనీస పెన్షన్ రూ.10వేలు ఇయ్యాలె..
ప్రభుత్వ ఉద్యోగుల ఈపీఎఫ్ కనీస పింఛను రూ.7,500 ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ క్రమంలో బొగ్గుగని రిటైర్డు కార్మికుల పింఛన్​ను కూడా  సవరించాలని కార్మికులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై బొగ్గుగని రిటైర్డు ఉద్యోగుల సంఘం ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై విచారణ నడుస్తుండగా, అక్టోబర్​లో  కోర్టు నుంచి వచ్చే ఆదేశాల కోసం రిటైర్​ కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు 11వ వేజ్​బోర్డు అగ్రిమెంట్​లో రిటైర్డు ఎంప్లాయిస్​కు కనీస పెన్షన్ రూ.10వేలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్​ పెట్టాయి.