షిఫ్టింగ్ పై వెయిటింగ్

షిఫ్టింగ్ పై వెయిటింగ్

సెక్రటేరియెట్ షిఫ్టింగ్ పై మరో రెండు రోజులు వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం తరలింపు, కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వచ్చే తీర్పు ఆధారంగా ముందుకెళ్లనుంది. జడ్జిమెంట్ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే వెంటనే షిఫ్టింగ్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం. హైకోర్టులో తీర్పు తమకు ప్రతికూలంగా వస్తే పిటిషనర్లు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్లు ఈనెల 8న విచారణకు రానున్నాయి.

దీటుగా వాదనలు..

‘సెక్రటేరియట్’ పిటిషన్లపై దీటుగా వాదన వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, సీఎస్ ఎస్ కే జోషి, సీఎంవో అధికారులతో భేటీ అయి చర్చించారు. సెక్రటేరియట్ పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను హైకోర్టులో గట్టిగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలకు హైకోర్టు అడ్డు చెప్పకపోవచ్చని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నెలాఖరుకు షిఫ్టింగ్ పూర్తి..

శాఖల తరలింపు ప్రక్రియను నెలాఖరు కల్లా పూర్తి చేయాలని సర్కారు యోచిస్తోంది. శాఖల వారీగా గడువు విధించినా, దానికన్నా ముందే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశాలు కనపడుతున్నాయి. దసరా వరకు మంచి ముహూర్తాలు లేనందున.. అప్పటి కల్లా కూల్చివేత పూర్తి చేస్తే దసరా తర్వాత నిర్మాణం ప్రారంభించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎంవో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

30 ఎకరాలు..

మొత్తం సెక్రటేరియట్ 25 ఎకరాల వరకు ఉండగా, గేటు సమీపంలో ఉన్న రాతి కట్టడంతోపాటు విద్యుత్ శాఖ కార్యాలయం, సీ బ్లాక్ వెనుక ఉన్న ఓ బిల్డింగ్ ను స్వాధీనం చేసుకోనున్నారు. వీటిన్నింటినీ కూల్చి వేస్తే మరో 5 ఎకరాల స్థలం యాడ్ అవుతుందని, అపుడు మొత్తం 30 ఎకరాల్లో నూతన సెక్రటేరియట్ నిర్మించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.